సంగీత దర్శకుడిగా శింబు
సంచలన నటుడు శింబు మరో కొత్త అవతారం ఎత్తడానికి సిద్ధం అయ్యారు. కథానాయకుడిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న శింబు కథకుడిగా, దర్శకుడిగా, గాయకుడిగానూ తన సత్తా చాటుకున్నారు. ఆ మధ్య బీప్ సాంగ్‌తో వివాదాలకు కారణమై, కేసులు, కోర్టుల వరకూ వెళ్లిన శింబు తాజాగా సంగీత దర్శకుడనే కొత్త హోదాకు రెడీ అయ్యారు. శింబు, సంతానం మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర నటుడైన సంతానంను వెండి తెరకు పరిచయం చేసిన ఘనత శింబుదే. అదే విధంగా శింబు హీరోగా నటించిన విన్నైతాండి వరువాయా చిత్రంతో హస్యనటుడుగా ప్రాచుర్యం పొందిన వీటీవీ గణేశ్‌కు ఆయనంటే ప్రత్యేక అభిమానం. సంతానం కథానాయకుడిగా వీటీవీ.గణేశ్ నిర్మిస్తున్న చిత్రం చక్కపోడు పోడు రాజా చిత్రం ద్వారా శింబు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సర్వర్ సుందరం చిత్రం ఫేమ్ వైభవి శాండిల్య నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి సేతురామన్ దర్శకుడు.
తాను సంగీత దర్శకుడిగా అవతారమెత్తడం గురించి శింబు స్పందిస్తూ ఆ చిత్ర దర్శక, నిర్మాతలు సంగీతాన్ని అందించమని కోరారని, కథ విన్న తాను నచ్చడంతో సంగీతాన్ని అందించడానికి అంగీకరించానని తెలిపారు. తనకు సంగీతం అంటే ఆసక్తి అధికం అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అందువల్ల సంగీత దర్శకుడిగా అవతారమెత్తినట్లు చెప్పారు. తాను మంచి సంగీతాన్ని అందించడానికి కృషి చేస్తానని, దాన్ని ఎలా ఆదరిస్తారన్నది ప్రేక్షకుల చేతిలో ఉంటుందని శింబు పేర్కొన్నారు. ఆయన ఇప్పుడు త్రిపాత్రాభినయం చేస్తున్న అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు.