ఎన్నికల తరువాత కూడా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ ఆసోషియేషన్)లో వివాదాలు సద్దుమణగటం లేదు. శివాజీరాజా, నరేష్‌ల మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. గత టర్మ్‌లో ఒకే ప్యానల్‌లో కలిసి పని చేసిన శివాజీ, నరేష్‌లు ఈ సారి ప్రత్యర్థులుగా బరిలో దిగారు. ఉత్కంఠ కలిగించిన ఈ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఎన్నికల తరువాత కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. నరేష్ వర్గం ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తం నిర్ణయించుకుంది. అయితే శివాజీ రాజా మాత్రం ‘తమకు మార్చి 31 వరకు గడువు ఉందని కోర్టు వెళ్తామన్నా’రని నరేష్ వెల్లడించారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న చెక్కులపై సంతకాలు పెట్టేందుకు కూడా పూర్వ సభ్యులు సహకరించటం లేదన్నారు.
తమకు కుర్చీ పిచ్చి లేదన్న నరేష్, ఎన్నికల సమయంలో శివాజీ రాజా తీరుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మా సభ్యులను శివాజీ వర్గం ఎత్తుకెళ్లిందని ఆరోపించారు. చట్టపరంగా ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎప్పుడైనా బాద్యతలు స్వీకరించే హక్కు మాకు ఉందన్న నరేష్, పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మా కోసం పనిచేయడానికి వచ్చామని తమకు అడ్డంకులు సృష్టించవద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment