'సీఎం గారూ.. ఆ మూవీ రిలీజ్ ఆపేయండి'
ముంబై: మరాఠా యోధుడు బాజీరావు పీష్వా, ఆయన ప్రియురాలు మస్తానీ మధ్య సాగిన ప్రేమకథను కళ్లకు కట్టేలా చూపించేందుకు దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తీసిన మూవీ 'బాజీరావు మస్తానీ'పై విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. చారిత్రక అంశాల నేపథ్యంలో తీసిన ఆ మూవీలో కొన్ని తప్పులు దొర్లాయని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఆరోపించారు. సమస్య వీగిపోయి, వివాదాస్పద సన్నివేశాలను మూవీ నుంచి తొలగించేంత వరకూ 'బాజీరావు మస్తానీ' విడుదల చేయడానికి అనుమతించవద్దని సేన ఎమ్మెల్యేలు మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కోరారు. మరాఠా పీష్వా బాజీరావు చరిత్రను ఆ చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ పూర్తిగా మరిచిపోయాడని శివసేన ఎమ్మెల్యేలు విమర్శించారు.
చారిత్రక అంశాలపై తీస్తున్న చిత్రంలో ఇలా చేయడం మంచిది కాదని ఎమ్మెల్యే సర్నాయక్ పేర్కొన్నారు. బాజీరావు మస్తానీ' విడుదలకు ముందే శాసనసభ్యులకు అసెంబ్లీలో స్పెషల్ షో ప్రదర్శించాలని సర్నాయక్ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 18న విడుదల కానున్న 'బాజీరావు మస్తానీ'లో రణ్‌వీర్ సింగ్ బాజీరావు పాత్రలో రాజసంతో కనిపిస్తుండగా, ఆయన భార్య కాశీబాయిగా అమాయకత్వం, భావోద్వేగం మేళవించిన పాత్రలో ప్రియాంకచోప్రా, బాజీరావు ప్రియురాలు మస్తానీగా దీపికా పదుకొణె నటించిన విషయం అందరికీ విదితమే.