సాధించాల్సింది ఎంతో ఉంది!
నటి శ్రద్ధాకపూర్
ముంబై: బాలీవుడ్‌లో అడుగుపెట్టి కనిపించింది మూడు సినిమాల్లోనే అయినా నటిగా మంచి మార్కులు కొట్టేసింది శ్రద్ధాకపూర్. అయితే ఇప్పటిదాకా తాను సాధించింది పెద్దగా ఏమీ లేదని, సాధించాల్సింది చాలా ఉందని, ‘ఆషికీ-2’ వంటి విజయాలెన్నింటినో అందుకోవాల్సి ఉందని చెబుతోంది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ నటించిన ‘ఆషికీ-2’ ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఇందులో కథానాయకుడికి ఎంత పేరొచ్చిందో నాయికకూ అంతకంటే ఎక్కువ పేరే వచ్చింది. ఈ ఒక్క సినిమాతోనే శ్రద్ధాకపూర్ అంటే ఎవరో అందరికీ తెలిసొచ్చింది. మిగతా రెండు సినిమాల్లో గ్లామర్ డాల్‌గానే కనిపించినా ఆషికీ-2లో మాత్రం నటనకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కడంతో రెచ్చిపోయింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సరసన నటించే అవకాశం మొదటి సినిమా ‘తీన్ పత్తీ’తో దక్కడంతో ఇక తనకు తిరుగుండదని భావించింది. అయితే ఆ సినిమా కాస్తా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత ప్రముఖ బ్యానర్ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో నటించింది.
‘లవ్ కా ది ఎండ్’ పేరుతో విడుదలైన ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దీంతో శ్రద్ధాకపూర్ కెరీ ర్ దాదాపుగా ముగిసిపోయిందనుకున్నారు సినీ విశ్లేషకులు. అయితే చిన్న హీరో, చిన్న బ్యానర్‌లో నటించే అవకాశం ‘ఆషికీ-2’ ద్వారా వచ్చింది. కాదనలేక చేసిన సినిమా కాస్తా కలెక్షన్లు కురిపించింది. ఇటు వసూళ్లతోపాటు బాలీవుడ్‌తో ఆమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. దీంతో శ్రద్ధాకపూర్ జాతకమే మారిపోయింది.
అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. అయినా తొలి రెండు సినిమాల విషయంలో జరిగిన పొరపాటు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటున్నానని, కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటున్నానని చెబుతోంది. మళ్లీ ‘ఆరోహి’ వంటి పాత్ర దక్కితే ప్రేక్షకులను మెప్పించేందుకు వందశాతం కష్టపడతానంటోంది. మరి ఈ అమ్మడు ఆశ తీరుతుందో లేదో చూడాలి.