
లుక్.. లుక్... బయోపిక్స్
బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా సాగుతోంది. బాక్సింగ్ క్వీన్ మేరీ కామ్, మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫోగట్, ఎయిర్ హోస్టెస్ నీర్జా.. ఇలా ఇప్పటికి పలువురి ప్రముఖుల జీవితకథలు వెండితెరకొచ్చాయి. ఇప్పుడు మరో రెండు బయోపిక్‌లకు రంగం సిద్ధమవుతోంది. ఒకటి ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమా. మరొకటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథతో తెరకెక్కనున్న చిత్రం. ఆల్రెడీ ‘మేరీకామ్’ బయోపిక్‌లో అద్భుతంగా నటించి, అందరి అభినందనలూ అందుకున్నారు ప్రియాంక.
ఇప్పుడు కల్పనా చావ్లా జీవితకథతో తీయనున్న సినిమాకు నూతన దర్శకురాలు ప్రియా మిశ్రా ఆమెనే సంప్రదించారట. వ్యోమగామి కల్పనా చావ్లా పాత్ర చేయడానికి ప్రియాంకా చోప్రా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఏడేళ్లుగా దర్శకురాలు ఈ కథను వర్కవుట్ చేస్తున్నారట. భారీ బడ్జెట్‌తో ఓ నూతన సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటోంది. ఇక, మరో బయోపిక్ విషయానికొస్తే.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ నటించనున్నారు. అమోల్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం శ్రద్ధా కపూర్ కసరత్తులు మొదలుపెట్టేశారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ‘‘సైనా జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఇదే చాలా క్లిష్టమైనది. నాకు పెద్ద సవాల్‌లాంటి సినిమా’’ అని శ్రద్ధాకపూర్ అన్నారు.