
సాక్షి, సినిమా : నటి శ్రియకు పెళ్లి కళ వచ్చేసింది. శ్రియ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది నటీమణుల్లానే శ్రియాకు చాలా కాలంగా మీడియా నుంచి ఎదురవుతున్న ప్రశ్న పెళ్లి ఎప్పుడు? అని. అలాంటి వాటినన్నిటిని ఎదుర్కొంటూ వస్తున్న ఆమెకు వివాహ గడియలు తోసుకొచ్చాయట. అవీ ఎంతో దూరంలో లేవు. మరో రెండు వారాల్లోనే అనే ప్రచారం వైరల్ అవుతోంది. అవును శ్రియ రష్యన్‌కు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కోస్‌చీవ్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని, మార్చిలో ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారని సమాచారం.
శ్రియ పెళ్లి వేడుక ఉదయపూర్‌లో మార్చి 17,18,19 తేదీల్లో జరగనుందని సమాచారం. అయితే ఈ విషయమై అధికారికపూర్వక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. కాగా కొద్ది రోజుల క్రితం కూడా శ్రియ పెళ్లిపీటలెక్కుతున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రియ స్పందిస్తూ ... పెళ్లి తనది కాదని, తన స్నేహితురాలిదని తెలిపింది. అయితే మరోసారి శ్రియ వివాహం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అవి వాస్తవమా కాదా అని తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇష్టం అనే తెలుగు చిత్రంతో ఇష్టపడి మరీ ఈ రంగంలోకి వచ్చిన ఉత్తరాది భామ శ్రియ. అలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ నటిగా మంచి గుర్తింపు పొందింది. శ్రియ కోలీవుడ్‌లో శివాజీ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం తలుపు తట్టింది. అంతే ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అదే విధంగా టాలీవుడ్‌లోనూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్స్‌తో నటించి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment