పెళ్లి కళ వచ్చేసిందా బాలా.!
పెళ్లి కూతురు గెటప్‌లో శ్రీయ పలు చిత్రాల్లో దర్శనమిచ్చారు. గడచిన రెండేళ్లల్లో ఆమె ఈ గెటప్‌లో కనిపించిన చిత్రం అంటే అది ‘మనం’. ఆ చిత్రంలో 1920ల నాటి పెళ్లి కూతురిగా కనిపించారు. ఆ తర్వాత 2013కి చెందిన అంజలిగా కూడా అగుపించి, ఆకట్టుకున్నారు. ఇప్పుడు కూడా శ్రీయ ఇలా రెండు రకాల పాత్రలు చేస్తున్నారు. అది తమిళ చిత్రం ‘అన్బానవన్.. అసరాదవన్.. అడంగాదవన్’. ఇందులో శింబుకి తల్లిగా, ప్రేయసిగా నటిస్తున్నారామె. తల్లి పాత్ర 1980లకి చెందినది. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. శ్రీయ, శింబూలపై పెళ్లి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న ఫొటో ఆ సన్నివేశానికి సంబంధించినదే. 1980లకి చెందిన పెళ్లి కూతురిగా శ్రీయ డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు కదూ. ఈ ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు శ్రీయ. ‘‘2016లో 1980లో ఉన్నట్లుగా కనిపించడం ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇలా డిఫరెంట్‌గా కనిపించే అవకాశం ఇస్తున్న నా జాబ్ అంటే నాకు చాలా ప్రేమ’’ అని శ్రీయ పేర్కొన్నారు. ‘శివాజి’ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన శ్రీయ అక్కడ చాలా సినిమాలే చేశారు. కానీ, ఈ మధ్యే కొంచెం గ్యాప్ వచ్చింది.
దాదాపు మూడు నాలుగేళ్ల తర్వాత శ్రీయ తమిళంలో కథానాయికగా నటిస్తున్న చిత్రం ఇది. తెలుగులో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లోనూ, హిందీలో ‘తడ్కా’లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె. ఇదిలా ఉంటే.. రీల్‌పై పలు సార్లు పెళ్లి కూతురిగా కనిపించిన శ్రీయ రియల్‌గా ఎప్పుడు పెళ్లి కూతురు అవుతారో కాలమే చెప్పాలి. థర్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్నారు కాబట్టి.. పెళ్లి కళ దగ్గర్లోనే ఉండే అవకాశం ఉందని ఊహించవచ్చు.