ఆ చింత లేదు
అలాంటి చింత తనకెప్పుడూ లేదంటున్నారు సంచలన తార శ్రుతిహాసన్. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ల జాబితాలో ఈ బ్యూటీ ఒకరు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ వీర విహారం చేస్తున్న శ్రుతి హాసన్ గ్లామర్ విషయంలోనూ రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా వృత్తిలో భాగమే. పాత్రకు న్యాయం చేయడం నటిగా నా ధర్మం అంటూ తనదైన స్టైల్‌లో బదులిస్తున్నారు. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నటించిన 7ఆమ్ అరివు, 3 చిత్రాలు రెండూ ఆశించిన విజయాల్ని సాధించలేదు. అయితే తెలుగు హిందీ చిత్రాలు ఈమెకు ఫేమ్ నిచ్చాయి. దీంతో ఆయా భాషా చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న శ్రుతి తాజాగా తమిళంలో మరో చిత్రాన్ని అంగీకరించారు. నటుడు విశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి పూజై అనే టైటిల్‌ను నిర్ణయించారు. దాదాపు రెండేళ్ల తరువాత శ్రుతి హాసన్ ఈ చిత్రం ద్వారా మళ్లీ తమిళ ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నారు.
ఈ మధ్యలో మాతృ భాషలో చిత్రాలు చేసే అవకాశం పోయిందనే చింత లేదా? అన్న ప్రశ్నకు శ్రుతి బదులిస్తూ అలాంటి చింత ఏమీ లేదన్నారు. ఎందుకంటే భారతీయ సినిమాను తన సొత్తుగా భావిస్తానన్నారు. తాను పలు భాషల్లో నటి స్తూ, భారతీయ నటిగా గుర్తింపు పొందానన్నారు. విశాల్ సరసన నటిచనుండడంపై మాట్లాడుతూ ఇప్పటికే తెలుగు కమర్షియల్ సినిమాలు చేసి ఎంజాయ్ చేశానని చెప్పారు. ఇప్పుడు తమిళంలో తొలిసారిగా మంచి మాస్ ఎంటర్ టెయినర్ చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో విశాల్ సరసన నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
ఈ చిత్ర కథ గురించి దర్శకుడు హరి చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందనిపించిందన్నారు. కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మణిరత్నం దర్శకత్వంలో మహేశ్ బాబు, నాగార్జున హీరోలుగా నటించే చిత్రంలో హీరోయిన్ అవకాశం వచ్చిందా అంటే, దాని గురించి మాట్లాడడం అప్రస్తుతం అవుతుందన్నారు. ప్రస్తుతానికి తన కాల్‌షీట్స్ డైరీ విశాల్ చిత్రంతోపాటు ఇతర భాషా చిత్రాలతో ఫుల్ అయ్యిందన్నారు. అయితే మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతి నటి కోరుకుంటుందని శ్రుతి వ్యాఖ్యానించారు.