నా ఖర్చులు వాళ్లు భరిస్తారా?
‘‘మన కోసం మనం బతకాలి. ఆ తర్వాత ఇతరుల గురించి ఆలోచించాలి. కానీ, మన గురించి వదిలేసి ఇతరుల గురించి అదే పనిగా ఆలోచిస్తే మన జీవితం ఇతరుల అదుపాజ్ఞల్లో ఉన్నట్లుగా ఉంటుంది’’ అని శ్రుతీహాసన్ అంటున్నారు. మన ప్రవర్తన ఇతరులను ఇబ్బందిపెట్టేలా ఉండకూడదనీ, నలుగురిలో ఉన్నప్పుడు కొంచెం సంస్కారం పాటించాలనీ ఆమె అభిప్రాయం. ఈ విషయం గురించి అమ్మడికి కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. ‘‘ఇతరుల్ని ఇబ్బందిపెట్టకూడదనే భావనతో అదే పనిగా వాళ్ల గురించే ఆలోచించకూడదు. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి.
‘వాళ్లేమనుకుంటారో... వీళ్లేమనుకుంటారో’ అనుకుని మనకు నచ్చింది కాక, ఇతరులకు నచ్చింది చేస్తే, జీవితం బోర్ కొట్టేస్తుంది. అలాగే, తోటి స్టార్స్ ఎంత సంపాదిస్తున్నారు? ఏమేం సినిమాలు అంగీకరించారు? అని ఆరా తీయడం మొదలుపెడితే, మనశ్శాంతి కరవవుతుంది. అందుకే, నా గురించి నేను ఆలోచిస్తా. ఇతరులేం చేస్తున్నారో తెలుసుకోను. వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వను. ఎందుకంటే, నా ఖర్చులు వాళ్లు భరించరు. నా అవసరాలు కూడా తీర్చరు. నాకేదైనా సమస్య వస్తే నేనే పరిష్కరించుకోవాలి. అందుకే నా అభిప్రాయం ప్రకారం నేను ముందుకు సాగుతుంటా’’ అని నిర్మొహమాటంగా తన మనసులోని మాటలు బయటపెట్టారు.