ఈ రోజుల్లో అబ్బాయి పెళ్లైనా, అమ్మాయి పెళ్లైనా.. ఖర్చులకు అంతు లేకుండా పోతోంది. వాడుక అని, వేడుక అని ఒకర్ని చూసి ఒకరు ఎక్కువ ఖర్చుపెడ్తున్నారు. ఆటలు, పాటలు, హల్దీ, మెహందీ, బ్యాచిలర్ పార్టీలు, సంగీత్, ప్రీ-వెడ్డింగ్ షూట్.. పెళ్ళిలో వందలాది వంటకాలు, బట్టలు, రిటర్న్ గిఫ్ట్‌లు, అలంకరణ, బ్యాండు, కచేరీలు, బంగారం.. ఆ తర్వాత కార్యక్రమాలకు హోటళ్లు.. అటు మీదట హనీమూన్. ఇవన్నీ పెళ్లి ఖర్చులు కిందే వస్తాయి. ఖర్చు పెడితే ఆదాయం రాదుగా.. ఇక పన్ను భారం ఏమిటండీ అంటారేమో.. ఓపిగ్గా చదవండి. పూర్తిగా చదవండి.
చట్టప్రకారం వరకట్నం నిషేధం. దాని జోలికి పోకండి. ఇవ్వకండి. ఏదైనా కారణాలవల్ల ఇవ్వాల్సి వస్తే ‘నగదు’ రూపంలో లావాదేవీలు నిర్వహించకండి. బ్యాంకుల ద్వారానే చేయండి. గిఫ్ట్ రూపంలో చేయండి. ఆ మేరకు డాక్యుమెంట్లు తయారు చేసుకోండి. మీ అమ్మాయి తరఫున ఇవ్వదలచినట్లయితే.. ‘స్త్రీధనం’ పేరున అమ్మాయి పేరుతోనే వ్య వహారం చేయండి.
స్త్రీధనం విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. ఎంతైనా ఇవ్వొచ్చు. అయితే, ఇచ్చిన బ్యాంకు బ్యాలెన్సుకి, ఇంటికి, స్థిరాస్తికి, పొలానికి, తోటకి, బంగారానికి, ఆభరణాలకు డాక్యుమెంట్లు ముఖ్యం. ఇవన్నీ మీకు ఎలా వచ్చాయో మీరు చెప్పాల్సి రావచ్చు. ఎవరికి? పెళ్లివారికి కాదు.. ఆదాయపు పన్ను డిపార్టుమెంటు వారికి. అడిగినప్పుడు వివరణ ఇవ్వాలి. ‘సోర్స్’ చెప్పాలి.
ఇక పెళ్లి ఖర్చులపై ఎటువంటి ఆంక్షలు లేవు. ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి ఖర్చులు విన్నాం. అలా ఎన్నో పెళ్ళిళ్లు. మన కంటికి ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. ఆ జోరు, హోరు, హుషారు, షికారు చూసి బంధువులు మెచ్చుకోవచ్చు. పెళ్లివారు సంతోషపడొచ్చు. కానీ ఆదాయపు పన్ను శాఖ వారి కంట్లో పడితే.. వారి దృష్టికి వెళితే, ఎవరైనా వారికి మీ ఖర్చుల మీద కంప్లైంట్ ఇస్తే.. ఖర్చుల విషయం ఆరా తీయడం చాలా తేలిక పని. అధికారుల వద్ద ఎన్నో పరికరాలు, పద్ధతులు ఉంటాయి. మిమ్మల్ని వాచ్ చేస్తారు. పెళ్లి పందిళ్లలో మమేకం అయిపోతూ, ఒక గెస్టులాగా మీతో మాట్లాడుతూ భోగట్టా చేస్తారు. కూపీ లాగుతారు. ఎంక్వైరీ చేస్తారు. మనం కూడా ఎంతో సంతోషంగా, సంబరంగా, గర్వంగా, గొప్పగా చెప్పేస్తాం. షేర్ చేసుకుంటాం.
ఇది కాకుండా పందిళ్లలో ఆ నోటా.. ఈ నోటా .. కొన్ని మాటలు వింటాం. వెండర్లు.. అంటే సర్వీస్ ప్రొవైడర్లు.. కొటేషన్లు ఇస్తున్నారు. అందులో జీఎస్‌టీ వసూలు చేస్తున్నారు. విజిటింగ్ కార్డులు పంచుతున్నారు. సోషల్ మీడియాలో టామ్‌టామ్ చేసుకుంటున్నారు. గూగుల్, పేటీఎంకు చెల్లింపులు చెయ్యమంటున్నారు. కాగితాలు, రుజువులు.. ఫొటోల సాక్షిగా దొరుకుతున్నాయి. ఒక విధంగా అంతా బట్టబయలే. పారదర్శకమైనదిగా కంటికి కనిపించేదిగానే ఉంటోంది. ఊహకు అందని విషయమేమీ కాదు. శ్రేయోభిలాషి ‘శభాష్’ అన్నా.. అధికారులు మనల్ని ‘బేహోష్’ చేయొచ్చు.
హాల్ బుకింగ్‌కి అడ్వాన్స్ ఇస్తే నోటీసులు వచ్చాయి. వెండార్స్ నుండి సమాచారం సంగ్రహించి, నోటీసులు ఇచ్చారు. మొత్తం ఖర్చు ఎంత అని అడిగితే.. మీరు ఏదో ఒక జవాబు ఇవ్వచ్చు. కానీ వాళ్ల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. కాస్సేపు ఇద్దరి లెక్కలు ఒకటే అనుకోండి. అయినప్పటికీ ఆ ఖర్చులకు ‘సోర్స్’ చెప్పాలి. సరైన, సంతృప్తికరమైన జవాబులు రాకపోతే, ఖర్చు మొత్తాన్నీ ‘ఆదాయం’గా భావించి పన్నులను చెల్లించమంటారు.
‘సోర్స్’ మీ సేవింగ్స్ కావచ్చు, మీరు అప్పు చేసి ఉండవచ్చు, మీ అబ్బాయి అమెరికా నుంచి పంపి ఉండవచ్చు.. ఎల్‌ఐసీ మెచ్యూరిటీ అయి ఉండవచ్చు.. ఎన్‌ఎస్‌సీలను ఎన్‌క్యాష్ చేసి ఉండొచ్చు.. ఏదైనా సరే.. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ‘సోర్స్’ ఉన్నంతవరకే ఖర్చు పెట్టండి.
Comments
Please login to add a commentAdd a comment