ఆయన తో డేటింగ్ నిజమే : శ్వేతాబసు
‘ఎ.. క్క.. డా..’ అంటూ ‘కొత్త బంగారు లోకం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బెంగాలీ బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్. మొదటి సినిమాతోనే మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అనే పేరొచ్చింది. కానీ, ఆ తర్వాత శ్వేతా జీవితంలో పలు అనూహ్య ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే. ఆ ఘటనల నుంచి బయట పడిన తర్వాత ముంబై వెళ్లారీమె. ప్రముఖ హిందీ దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్, తన నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిల్మ్స్‌లో ఉద్యోగం ఇచ్చారు.
అప్పుడే అప్ కమింగ్ ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిట్టల్‌తో శ్వేతాకు పరిచయమైందని, ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. సదరు వార్తలపై స్పందించకుండా ఇన్నాళ్లూ మౌనం వహించిన ఈ బ్యూటీ ఇప్పుడు పెదవి విప్పారు. ‘‘యస్.. డేటింగ్ వార్త నిజమే. రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. వియ్ ఆర్ హ్యాపీ. ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ, చాలా స్మూత్‌గా మా పెళ్లి జరుగుతుందనే నమ్మకముంది.
ఫాంటమ్ ఫిల్మ్స్‌లో రోహిత్‌ని కలిశాను. అప్పట్నుంచి మా ప్రయాణం మొదలైంది’’ అని శ్వేతాబసు ప్రసాద్ చెప్పారు. వీళ్లిద్దరి ప్రేమకథలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారట. ప్రస్తుతం వరుణ్ ధావన్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ‘బద్రినాథ్ కి దుల్హనియా’తో పాటు శ్వేత ఓ హిందీ సీరియల్‌లోనూ నటిస్తున్నారు.