బస్ మిస్సింగ్..!
కొత్త జీవితాలను ప్రారంభించాలనుకున్న ప్రేమికులు, మరదలి కోసం వెతుకుతున్న బావ, ఎంజాయ్ చేసేందుకు టూర్‌కు వెళ్తున్న దంపతులు ఇలా ప్రతి ఒక్కరిది ఒక్కో కథ. ఈ అందరూ సువర్ణసుందరి టూర్ బస్‌లో ప్రయాణం చేస్తుంటారు. సడన్‌గా ఆ బస్సు మాయమౌతుంది. ప్రయాణికులను కిడ్నాప్ చేసింది ఎవరు? కిడ్నాపర్ల డిమాండ్స్ ఏంటి? ప్రయాణికులు ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కారు..? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మిక్సర్ పొట్లం’.
శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్రలో ఎంవి సతీష్‌కుమార్ దర్శకత్వంలో భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా గోదావరి సినీటోన్ పతాకంపై కలపటపు శ్రీ లక్ష్మీప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు, సంయుక్తంగా నిర్మించారు. గీతాంజలి కథానాయిక. సుమన్, భానుచందర్ నటించారు. మే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు మా చిత్రాన్ని రెండు ఏరియాల్లో రిలీజ్ చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సతీష్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా రంగంలోకి వచ్చి ‘మిక్చర్ పొట్లం’ సినిమాను నిర్మించాం. మాధవపెద్ది సురేష్ మంచి సంగీతం అందించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు.