బాలీవుడ్ గాయకుడికి మరోసారి చుక్కెదురు
ముంబయి: సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసి భంగపడ్డ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య (58)కు మరోసారి చుక్కెదురైంది. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ మరో సారి అభిజిత్ ఖాతాను సస్పెండ్ చేసింది. సోమవారం ఉదయం ఖాతా యాక్టివేట్ అయిన కొద్ది సమయంలోనే అతనికి నిరాశ ఎదురైంది. అభిజిత్ ట్విట్టర్ ఖాతా మళ్లీ సస్పెండ్ అయింది.
అభిజీత్ తాజాగా తన ట్విటర్ లో మరో ఖాతాను ఓపెన్ చేశారు. ఇది నా అధికారిక ట్విట్టర్ అకౌంట్.. మిగతావన్నీ ఫేక్ అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇటీవల తాను ట్విట్టర్‌కు దూరంగాతో ఉండడంతో తన ప్రతిష్టను భంగపర్చడానికి కొన్ని నకిలీ ఖాతాలు వచ్చాయని ఈ వీడియో క్లిప్ లో పేర్కొన్నారు. వందేమాతరం ..తాను మళ్లీ వచ్చేశాననీ, దేశద్రోహులు తన నోరు మూయించలేరని వ్యాఖ్యానించారు. భారత సైన్యానికి తన సెల్యూట్’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ ట్విట్ చేసిన కొద్ది గంటల్లోనే అభిజీత్ ఖాతా మళ్లీ సస్పెండ్ కావడం విశేషం.
కాగా ఇటీవల జేఎన్‌యూ విద్యార్థిని గురించి ట్విటర్‌లో అసభ్యకరంగా వ్యాఖ్యానించాడన్న కారణంగా అతని ట్విటర్ ఖాతాని ట్విట్టర్ బ్లాక్ చేయడం, దీనికి నిరసనగా మరో బాలీవుడ్ సింగర్ ట్విటర్ ఖతాను ఉపసంహరించుకోవడం తెలిసిన విషయాలే. అయితే ఈ వ్యవహారంపై అభిజీత్ ఇంకా స్పందించలేదు.