మనసుతో పాడతాను
పి.సుశీల.. పరిచయం అక్కరలేని గాత్రం. మండుటెండల్లో విజయవాడ వచ్చిన ఆమె తన గానామృతంతో చిరుజల్లులు కురిపించారు. ‘మావిచిగురు తినగానే కోయిల పలికేనా.. కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..’ అన్న చందాన సుశీల పాడటం వల్ల పాటకు అందం వచ్చిందా, పాటలోని మాధుర్యం వల్ల సుశీల గాత్రానికి అందం వచ్చిందా అంటే సమాధానం దొరకదు. ‘వాగర్థావివ సంపృక్తౌ’ (వాక్కు + అర్థం) అన్న చందాన పాటను, సుశీల గాత్రాన్ని విడదీయలేం. ఆమె పాడే రాగం ఏదైనా అది సుశీల రాగమే. గిన్నిస్ రికార్డు సాధించిన నేపథ్యంలో సన్మానం అందుకునేందుకు విజయవాడ వచ్చిన ఈ గానకోకిల ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు.
గాంధీ జయంతి నాడు నేను ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద పాడటం జీవితంలో మరిచిపోలేను. దక్షిణాది నుంచి వెళ్లిన ఏకైక గాయని నేనే. ఎంఎస్ సుబ్బులక్ష్మి తర్వాత పాడింది నేనే. అందుకు నాకు ఆనందంగా ఉంది. అలాగే, శ్రీలంకలో ‘కంబన్’ అవార్డు ఇస్తున్న సందర్భంగా నన్ను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అది మరో తీపి జ్ఞాపకం.
సాక్షి: విజయవాడ వచ్చారు కదా? ‘కృష్ణవేణి’ చిత్రంలో పాడిన ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోణి’ పాట గుర్తొస్తుందా?
సుశీల : విజయవాడ రావడం ఆనందంగా, హాయిగా ఉంది. నాకు నగరంతో ఉన్న అనుబంధం అలాంటిది. ‘కృష్ణవేణి’ చిత్రంలో అది చాలా మంచి పాట. ఆ రోజుల్లో అంత మంచి పాటలు పాడటం వల్లే నాకు ఈ గుర్తింపు వచ్చింది. అది భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాను.
సాక్షి : మీరు పాడిన పాటల్లో బాగా నచ్చిన పాట?
సుశీల : నా గురించి నేను చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఏ పాట ఇచ్చినా నా మనసుకు సొంతం చేసుకుని పాడతాను. అదే నాకు ఇష్టం. ‘సుశీల పాడితే ఈ పాట బాగుంటుంది. మంచి మెరుగు వస్తుంది’ అనుకున్నప్పుడే నాతో పాడిస్తారు. అందువల్ల నేను పాడిన అన్ని పాటలూ ఇష్టపడతాను. అంతేకాదు పాటలు పాడటానికి విశ్రాంతి ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. దేవుడు నాకు వరంగా ఇచ్చిన గాత్రానికి పూర్తి న్యాయం చేకూర్చితే చాలు.
సాక్షి : విజయవాడ ఆకాశవాణితో మీ అనుబంధం?
సుశీల : నేను మొదట్లో విజయవాడ ఆకాశవాణిలో కర్ణాటక సంగీతం విభాగంలో బి-గ్రేడ్ ఆర్టిస్టుగా ఉన్నాను. అరగంటసేపు కచేరీ ఇచ్చేదాన్ని. ఆ తరువాత అది మద్రాసుకు మార్చుకున్నాను. అక్కడ ఏ-గ్రేడ్ కోసం మళ్లీ ఆడిషన్‌కు రమ్మన్నారు. కానీ, అప్పటికే నేను సినిమాల్లో బిజీగా ఉండటంతో ఇక మళ్లీ వెళ్లలేదు. అక్కడితో కర్ణాటక సంగీతం పాడటం తగ్గించేశాను. సినిమాల్లో నిలబడిపోయాను.
సాక్షి : లలిత సంగీతం గురించి చెప్పండి
సుశీల : లలిత సంగీతం కూడా పాడాను. పాపాగారు, ఎస్.రాజేశ్వరరావు గార్ల సంగీత దర్శకత్వంలో ఎన్నో లలిత గీతాలు పాడాను. అప్పుడు నా గొంతును డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి వినిపించాను. ఆయన నా పాటలు విని ‘నీ గాత్రం బాగుంది. నువ్వు సినిమాలకు పాడితే బాగుంటుంది’ అని ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వాదంతో ఇంతదాన్ని అయ్యాను. ఆయన అపర త్యాగరాజు. ఆయన ఆశీర్వదించిన కొంతకాలానికే ఆయనతో గొంతు కలిపి సినిమాల్లో పాడటం నా అదృష్టంగా భావిస్తాను. ఇద్దరం ఒకే మైక్ దగ్గర పాడాం. ‘నేను చె ప్పిన అమ్మాయి ఇంత పెద్ద గాయని అయింది’ అని సంబరపడ్డారు.
సాక్షి : ఉయ్యూరు చంద్రశేఖర్ గారి గురించి..
సుశీల : ఆయనకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఎన్నో వేల పాటలు పాడాను. కానీ, అన్నీ నా దగ్గర భద్రపరచుకోలేదు. ఆయన నా పాటలు 2వేల వరకూ భద్రపరిచారు. నాకు గిన్నిస్ రికార్డు రావడానికి అది చాలా ఉపయోగపడింది. ఆయనకు నేనంటే ఎంత అభిమానం లేకపోతే ఇంత జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఇంతవరకు నేను ఆయనను చూడలేదు. కానీ, ఆయన నా పట్ల ప్రదర్శించిన అభిమానాన్ని ఎన్నటికీ మరిచిపోలేను.
సాక్షి : కొత్తగా వస్తున్న గాయకులపై మీ స్పందన
సుశీల : చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ ఎంతో బాగా పాడుతున్నారు. నేను పాడిన పాత పాటలు ఎంతో మధురంగా ఆలపిస్తున్నారు. ఆ పాటలకు మెరుగులు దిద్దుతున్నారు. వాళ్ల ద్వారా మేము మళ్లీ పాపులర్ అవుతున్నాం. మాకు ఇది పునర్జన్మ. ఆడమగా గాత్రం తేడా లేకుండా నా పాటలు, బాలు పాటలు, జేసుదాసు పాటలు ఆలపిస్తున్నారు. ఆ పిల్లలు మా పేర్లు చెబుతుండటం వల్ల, వాళ్లు మమ్మల్ని చూడాలి అని తాపత్రయపడుతుంటారు.
సాక్షి : రిటైర్మెంట్ తరువాత ఎలా ఉంది?
సుశీల : ప్రజలు నాకు రిటైర్మెంట్ ఇవ్వట్లేదు. నన్ను ఎక్కడా విడిచిపెట్టట్లేదు. సభలకు, సన్మానాలకు పిలుస్తున్నారు. అప్పుడు మాత్రం పాడుతున్నాను. భక్తి సంగీతం ఎక్కువగా పాడుతున్నాను. అయితే ఎక్కువ ఓపిక లేక అన్నిచోట్లకూ వెళ్లలేకపోతున్నాను.