అనుమానాస్పద స్థితిలో గాయని మృతి
చెన్నై: అలనాటి సంగీత దర్శకుడు జాన్సన్ కూతురు, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ షాన్ జాన్సన్(29) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. చివరిసారిగా శుక్రవారం ఉదయం స్నేహితునితో కలిసి ఆమె తన ఫ్లాట్ కు వెళ్లిందని బంధువులు పోలీసులకు తెలిపారు. ఫ్లాట్ కు వెళ్లిన తర్వాత నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదని షాన్ జాన్సన్ బంధువులు చెబుతున్నారు. దీంతో షాన్ సన్నిహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులు చాలాసార్లు తలుపుకొట్టగా ఎలాంటి అలికిడి లేదు.
తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా బెడ్ మీద ఆమె చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. అయితే షాన్ జాన్సన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎలాంటి ఆనవాళ్లు అక్కడ కనిపించలేదు. ఆమె అనారోగ్యంతో బాధ పడుతుండేదని, ఆ కారణాల వల్ల షాన్ చనిపోయి ఉండొచ్చునని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది..
ఇదిలాఉండగా.. రెండో వివాహం చేసుకునేందుకు షాన్ శనివారం కొచ్చి వెళ్లాల్సి ఉండేనని బంధువులు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో షాన్ తల్లి రాణి చెన్నైలోనే ఉంది. వీరిద్దరూ కలిసి శనివారం వెళ్లాలనుకున్నారు. అయితే, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఇదివరకే పెళ్లిచేసుకున్న షాన్ మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది.
ఆ ఇంట్లో మరోసారి విషాదం...
మలయాళ, తమిళ భాషల్లో పాటలకు గాత్రం అందించటమే కాకుండా , పలు సినిమాలకు ఆమె మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసేది. షాన్ తండ్రి జాన్సన్ జాన్సన్ మాస్టర్ గా ప్రసిద్ధి. ఆయన 2011, ఆగస్టు 18న కన్నుమూశారు. ఆ మరుసటి ఏడాది (2012, ఫిబ్రవరి) ఆయన కుమారుడు రెన్ జాన్సన్(23) రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా షాన్ కూడా అనుమానాస్పదస్థితిలో చనిపోవడంతో వారి ఇంట్లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి.