నటన పట్ల అంత ఆసక్తి లేదు
అన్నవరం : గాయని సునీత ఉపద్రష్ట.. పరిచయం అక్కరలేని ప్రతిభావంతురాలు. అటు టీవీ రంగంలో, ఇటు సినిమా రంగంలో గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా, టీవీల్లో సినీ సంగీత కార్యక్రమాల నిర్వాహకురాలిగా ఆమె గళం నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. గాయనిగా మూడు వేల పైచిలుకు పాటలు పాడిన ఆమె చిన్నారులను ఆ కళలో తీర్చిదిద్దేందుకు త్వరలోనే సంగీత అకాడమీ ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆదివారం సత్యదేవుని ఆలయానికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.
సాక్షి: ఇప్పటి వరకూ ఎన్ని పాటలు పాడారు?
సునీత: సుమారు మూడు వేలు ఉంటాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం తదితర భాషల్లో పాడాను.
సాక్షి: ప్రస్తుతం ఏ సినిమాలకు పాడుతున్నారు?
సునీత: ఆర్ పీ పట్నాయక్ తులసీదళం, ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ధనుష్, పార్వతీ సలీంకుమార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మరియన్ సినిమాల్లో కూడా పాడాను.
సాక్షి: విదేశీ పర్యటనలు కూడా ఎక్కువగా చేస్తున్నట్టున్నారు?
సునీత: గత మూడేళ్లుగా విదేశాల్లో ఎక్కువ పోగ్రామ్స్ చేశాను. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, మలేసియా, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలు పర్యటించాను.
సాక్షి: గాయనిగా మీ అనుభవాలతో చిన్నారులకు శిక్షణ ఇవ్వవచ్చు కదా?
సునీత: చిన్నారుల కోసం సంగీత అకాడమీ ఏర్పాటు చేయాలనుంది. హైదరాబాద్ లేదా విజయవాడల్లో ఏదో ఒక చోట పెడతాను. వివరాలు త్వరలోనే వెల్లడిస్తా.
సాక్షి: సినిమాలలో కూడా నటిస్తారా?
సునీత: (రెండు చేతులూ జోడించి) ఈ గుర్తింపు చాలండీ, ఇంకా నటన కూడా ఎందుకు. నటన పట్ల అంత ఆసక్తి లేదు.