Music Academy
-
రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే!
చదువు పూర్తయి సంగీత పరిశ్రమలో స్థిరపడాలనుకునే వారి తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన ఎదురవుతోంది. ఆ రంగంలో స్థిరపడేవారి ఆదాయమార్గాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే భావన ఉంది. దాంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని భయపడుతారు. కానీ 2022లో దేశంలోని మ్యూజిక్ ఇండస్ట్రీ ఏకంగా రూ.12000 కోట్ల వ్యాపారం సాగించింది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రూ.2.1 లక్షల కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. అయితే అందులో మ్యూజిక్ ఇండస్ట్రీ 6 శాతం వాటా కలిగి ఉంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లోని టాప్ 10 పాటల్లో ఏడు భారతీయులవే కావడం విశేషం. పుష్ప సినిమాలో సునిధి చౌహాన్ పాడిన ‘రారా సామీ’ పాట ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీనికి 1.55 బిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇంద్రావతి చౌహాన్ పాడిన ‘ఊ అంటావా’ పాటను 1.52 బిలియన్ల మంది చూశారు. మ్యూజిక్ కంపోజర్లు, గేయ రచయితలు, సింగర్లకు చెల్లించే డబ్బు 2.5 రెట్లు పెరిగినట్లు తెలిసింది. ప్రత్యేకంగా మ్యూజిక్ ఆల్బమ్స్‌ను క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదిస్తున్నవారు, లైవ్‌షోల ద్వారా అర్జిస్తున్నవారు, డిస్కో జాకీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ది మ్యూజిక్ క్రియేటర్ ఎకానమీ: ది రైజ్ ఆఫ్ మ్యూజిక్ పబ్లిషింగ్ ఇన్ ఇండియా, 2023 నిర్వహించిన సర్వే ప్రకారం.. 40,000 కంటే ఎక్కువ మంది సంగీత సృష్టికర్తలు ఏటా 20,000-25000 పాటలను సిద్ధం చేస్తున్నారు. ఈ సర్వేలో అప్పటికే ఉంటున్న పాటలు, మ్యూజిక్ రీమిక్స్ చేస్తున్నవారిని పరిగణలోకి తీసుకోలేదు. వారిని కూడా కలుపుకుంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా పేరున్న సంస్థలు విడుదల చేసే మ్యూజిక్కే ఆదరణ ఉండేదని, కానీ పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా స్థానికంగా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్న వారి కంటెంట్‌కు సైతం మంచి ఆదరణ లభిస్తోందని సర్వే ద్వారా తెలిసింది. ఇదీ చదవండి: రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు? 1957నాటి కాపీరైట్ చట్టంలో 2012లో మార్పులు తీసుకొచ్చారు. రికార్డింగ్‌ని యధాతథంగా కాకుండా అదే పాటను మరొక సింగర్ పాడవచ్చు. వేరొక ట్యూన్‌కి సెట్ చేయవచ్చు. లైవ్‌షోలో పాడవచ్చు. దాంతో వివిధ మార్గాల నుంచి రాయల్టీలు పొందే వీలుంది. -
LMA లో జరిగే మ్యూజిక్ క్లాసెస్ అన్ని ఫ్రీ
-
సహగమపదని..!
వాకా మంజులారెడ్డి సంగీత కచేరీ వేదిక మీద సహవాయిద్యాలతో అలరించే వాళ్లలో ఎక్కువగా మగవాళ్లే కనిపిస్తుంటారు. ఈ తరం మహిళలు ఆ భేదాన్ని తుడిచేస్తున్నారు. రేపు (మే 11, శనివారం) హైదరాబాద్, రవీంద్ర భారతిలో జరుగుతున్న సంగీత విభావరిలో పాల్గొంటున్న వాద్యకారులంతా మహిళలే. వయోలిన్, సహ వయోలిన్, మాండలిన్, ఫ్లూట్, మృదంగం, తబలా, ఘటం, మోర్చింగ్వాద్యాలను మహిళలే వాయిస్తారు. మొత్తం ఎనిమిది మంది మహిళలు పంచుకోనున్న ఈ వేదిక దక్షిణ భారతమంతటికీ ప్రాతినిధ్యం వహిస్తోంది. వయోలిన్ విద్వాంసురాలు అవసరాల కన్యాకుమారి సంగీత ప్రపంచ వైతాళికుల్లో ఒకరు. మద్రాసు మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారం అందుకున్న తొలి మహిళా వయోలిన్ వాద్యకారిణి ఆమె. దాదాపుగా యాభై ఐదేళ్ల సంగీత సాధనలో ఆమె దేశ విదేశాల్లో వేలాది కచేరీలు నిర్వహించి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలందుకున్నారు. ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విభాగంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి మహిళ కన్యాకుమారి. పదేళ్ల కిందట తమిళనాడులో తీవ్రమైన దుర్భిక్షం నెలకొన్న తరుణంలో పద్మనాభస్వామి కోవెలలో స్వరజతి నిర్వహించారు. అప్పుడు వర్షం కురిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘అది మా సంగీతకారుల గొప్పతనం కాదు, స్వరం– సాహిత్యం కలయికల గొప్పతనం’’ అన్నారామె. ఆమె కీర్తికిరీటంలో మరో కలికితురాయి అఖండం. ఎనభై మంది సంగీతకారులతో ఒక్కొక్కరు అరగంట చొప్పున ఇరవై నాలుగ్గంటల సేపు నిరంతరాయంగా సంగీత కచేరీ నిర్వహించారామె. విజయనగరంలో పుట్టిన తాను చెన్నైలో స్థిరపడడానికి కారణం అక్కడ సంగీతానికి ఉన్న ఆదరణేనన్నారు. ‘‘తమిళనాడులో సంగీతానికి ప్రత్యేక ఆదరణ ఉంది, ఆ కారణంగానే మన తెలుగు కళాకారులు అనేక మంది చెన్నైలో స్థిరపడుతున్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు, బాల మురళీకృష్ణ, సుశీల వంటి సంగీతఖనులు తమిళనాడుకి వెళ్లడానికి కారణం తమిళుల సంగీతారాధన, కళకు లభిస్తున్న గౌరవాలే. నా యాభై ఐదేళ్ల సంగీత ప్రయాణంలో పాతిక సంగీత సాధనాలతో జుగల్బందీ ప్రయోగాలు చేశాను. వాయిద్యకారులుగా మహిళలు తక్కువగానే ఉన్నారు. ఫ్లూటు, మాండలిన్, ఘటం, మోర్చింగ్లో అయితే మరీ తక్కువ. ప్రస్తుతం వోకల్ మ్యూజిక్‌తో పోలిస్తే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌కి ఆదరణ తగ్గుతోంది. వోకల్ రాణించాలంటే ఇన్స్ట్రుమెంట్స్ సహకారం తప్పని సరి. అన్ని రకాల సంగీతరీతులనూ గౌరవించగలిగినప్పుడే కళ సమతుల్యంగా ఉంటుంది’’ అన్నారు కన్యాకుమారి. కావేరి తీరాన గోదావరి సంగీతం మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఐదేళ్లకు చెన్నైలో ఉన్న తాతగారి దగ్గరకు వెళ్లిపోయాను. నాకు మాండలిన్ నేర్పించాలనేది ఆయన కోరికే. ఆరేళ్ల నుంచి ప్రాక్టీస్ చేసి, ఎనిమిదేళ్లకు తొలి కచేరీ ఇచ్చాను. త్యాగరాజు ఆరాధన ఉత్సవాల సందర్భంగా తమిళనాడులో కావేరీ నది తీరాన తిరువాయూర్లో తొలి ప్రదర్శన ఇచ్చే భాగ్యం కలిగింది. అది త్యాగరాజు పుట్టిన ఊరు. అప్పట్లో నన్ను చైల్డ్ ప్రాడిజీ బేబీ నాగమణి అనేవారు. చెన్నైలో చిన్మయ విద్యాలయలో చదువుకున్నాను. ఆ స్కూలు సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. తొమ్మిదేళ్లకే సౌత్ ఆఫ్రికాలో పదిహేను కచేరీలు చేయగలిగాను. కాశ్మీర్ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కచేరీలు చేశాను. నా తొలి గురువు, మామయ్య అయిన యు.పి రాజుగారితో వివాహమైంది. చెన్నైలో స్థిరపడ్డాం. చెన్నైలోనే ‘శాస్త్రీయ మాండలిన్ శిక్షణ’ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. – ఉప్పలపు నాగమణి, మాండలిన్ వాద్యకారిణి అష్ట స్వర సంగమమ్ విజయనగరంలో పుట్టిన కన్యాకుమారి, పాలకొల్లు వాద్యకారిణి బేబీ నాగమణి, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి తబలాలో పట్టా పుచ్చుకున్న కేరళ మహిళ రత్నశ్రీ, బెంగుళూరు నుంచి ఫ్లూట్ కళాకారిణి వాణీ మంజునాథ్, మోర్చింగ్ విద్వాంసురాలు భాగ్యలక్ష్మి ఎమ్ కృష్ణ, తమిళనాడు నుంచి మృదంగ విద్వాంసురాలు అశ్విని శ్రీనివాసన్, ఘట వాద్యకారిణి రమ్య రమేశ్, అనుతమ మురళి.. రేపు తెలుగు శ్రోతలను అలరించడానికి హైదరాబాద్‌లో కొలువుదీరనున్నారు. కన్యాకుమారి ఆధ్వర్యంలో ఈ ‘సంగీత సంగమమ్’ జరుగుతోంది. ఈ సంగీత విభావరిని వెంకటాచలం అయ్యర్ జ్ఞాపకార్థం ప్లాంజెరీ ఫౌండేషన్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు శంకర్ ప్లాంజెరీ, రాజ్యలక్ష్మి ప్లాంజెరీ దంపతులు తెలియచేశారు. నాన్నను చూసి నేర్చుకున్నాను మాది బెంగళూరు. మా నాన్నగారు ప్రముఖ మోర్చింగ్ కళాకారుడు ‘గానకళా భూషణ’ విద్వాన్ డాక్టర్ ఎల్ భీమాచార్. ఆయన ప్రాక్టీస్ చేస్తుంటే రోజూ చూసేదాన్ని. అలా మోర్చింగ్ మీద ఆసక్తి కలిగింది. పదేళ్ల వయసు నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టాను. దేశవిదేశాల్లో పదిహేను వందల కచేరీల్లో పాల్గొన్నాను. డాక్టర్ ఎం. బాల మురళీ కృష్ణ, విదుషి నీల రామ్‌గోపాల్, విదుషి ఎ. కన్యాకుమారి, సంజయ్, సుధా రఘునాథన్ వంటి ప్రముఖులకు మోర్చింగ్ సహకారం అందించాను. ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ట్ని. ఈ రంగంలో అమ్మాయిలను తీసుకురావాలనేది నా కోరిక. భాగ్యలక్ష్మి ఎం. కృష్ణ, తొలి మహిళా మోర్చింగ్ కళాకారిణి -
నటన పట్ల అంత ఆసక్తి లేదు
అన్నవరం : గాయని సునీత ఉపద్రష్ట.. పరిచయం అక్కరలేని ప్రతిభావంతురాలు. అటు టీవీ రంగంలో, ఇటు సినిమా రంగంలో గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా, టీవీల్లో సినీ సంగీత కార్యక్రమాల నిర్వాహకురాలిగా ఆమె గళం నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. గాయనిగా మూడు వేల పైచిలుకు పాటలు పాడిన ఆమె చిన్నారులను ఆ కళలో తీర్చిదిద్దేందుకు త్వరలోనే సంగీత అకాడమీ ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆదివారం సత్యదేవుని ఆలయానికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి: ఇప్పటి వరకూ ఎన్ని పాటలు పాడారు? సునీత: సుమారు మూడు వేలు ఉంటాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం తదితర భాషల్లో పాడాను. సాక్షి: ప్రస్తుతం ఏ సినిమాలకు పాడుతున్నారు? సునీత: ఆర్ పీ పట్నాయక్ తులసీదళం, ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ధనుష్, పార్వతీ సలీంకుమార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మరియన్ సినిమాల్లో కూడా పాడాను. సాక్షి: విదేశీ పర్యటనలు కూడా ఎక్కువగా చేస్తున్నట్టున్నారు? సునీత: గత మూడేళ్లుగా విదేశాల్లో ఎక్కువ పోగ్రామ్స్ చేశాను. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, మలేసియా, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలు పర్యటించాను. సాక్షి: గాయనిగా మీ అనుభవాలతో చిన్నారులకు శిక్షణ ఇవ్వవచ్చు కదా? సునీత: చిన్నారుల కోసం సంగీత అకాడమీ ఏర్పాటు చేయాలనుంది. హైదరాబాద్ లేదా విజయవాడల్లో ఏదో ఒక చోట పెడతాను. వివరాలు త్వరలోనే వెల్లడిస్తా. సాక్షి: సినిమాలలో కూడా నటిస్తారా? సునీత: (రెండు చేతులూ జోడించి) ఈ గుర్తింపు చాలండీ, ఇంకా నటన కూడా ఎందుకు. నటన పట్ల అంత ఆసక్తి లేదు. -
28న అంతరం నృత్య ప్రదర్శన
కొరుక్కుపేట: ప్రముఖ సినీ నటి సుహాసిని మణిరత్నం, నృత్యకారిణులు గోపికవర్మ, క్రితికా సుబ్రమణియన్, యామినీ రెడ్డి కలసి దక్షిణ భారత దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని నలుగురు దేవతల జీవిత చరిత్రను వివరించే విధంగా అంతరం పేరుతో నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు చెన్నై, మ్యూజిక్ అకాడమి వేదికగా జరగనుంది. వివరాలు తెలియజేయడానికి నగరంలోని ఓ హోటల్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో సుహాసినీ మణిరత్నం, క్రితికా సుబ్రమణియన్, గోపిక వర్మ హాజరై అంతరం నృత్య ప్రదర్శన గురించి వివరించారు. సుహాసినీ మాట్లాడుతూ, కళలను పోషిస్తూ యువ కళాకారులను ప్రోత్సహిస్తున్న ‘నా మార్గం’ డ్యాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో అంతరం నృత్య ప్రదర్శన ఇవ్వనున్నామన్నారు. డ్యాన్సు కంపెనీకి చెందిన క్రితికా సుబ్రమణియన్ రూపొందించిన నలుగురు దేవతల జీవిత చరిత్రను చాటుతూ అంతరం పేరుతో నృత్య ప్రదర్శనలో తనతోపాటు ప్రముఖ నృత్య కారిణులు ముగ్గురు క్రితికా సుబ్రమణియన్, యామిని రెడ్డి, గోపికావర్మ పాల్గొంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ దేవత వాసవీదేవిగా కూచిపూడి కళాకారిణి యామినిరెడ్డి, కేరళ దేవత కన్నగీదేవిగా మోహినీ అట్టం నృత్యకారిణి గోపికావర్మ, తమిళనాడు దేవత ఆండాల్ దేవిగా భరత నాట్యకారిణి క్రితికా సుబ్రమణియన్, కర్ణాటక దేవత రంబాగా నటి సుహాసినీ నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారని అన్నారు. నాలుగు రాష్ట్రాల నుంచి దేవతల జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తామన్నారు. భక్తి చాటేలా ఉండే అంతరం నృత్య ప్రదర్శన చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందన్నారు.