28న అంతరం నృత్య ప్రదర్శన
కొరుక్కుపేట: ప్రముఖ సినీ నటి సుహాసిని మణిరత్నం, నృత్యకారిణులు గోపికవర్మ, క్రితికా సుబ్రమణియన్, యామినీ రెడ్డి కలసి దక్షిణ భారత దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని నలుగురు దేవతల జీవిత చరిత్రను వివరించే విధంగా అంతరం పేరుతో నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు చెన్నై, మ్యూజిక్ అకాడమి వేదికగా జరగనుంది. వివరాలు తెలియజేయడానికి నగరంలోని ఓ హోటల్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో సుహాసినీ మణిరత్నం, క్రితికా సుబ్రమణియన్, గోపిక వర్మ హాజరై అంతరం నృత్య ప్రదర్శన గురించి వివరించారు.
సుహాసినీ మాట్లాడుతూ, కళలను పోషిస్తూ యువ కళాకారులను ప్రోత్సహిస్తున్న ‘నా మార్గం’ డ్యాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో అంతరం నృత్య ప్రదర్శన ఇవ్వనున్నామన్నారు. డ్యాన్సు కంపెనీకి చెందిన క్రితికా సుబ్రమణియన్ రూపొందించిన నలుగురు దేవతల జీవిత చరిత్రను చాటుతూ అంతరం పేరుతో నృత్య ప్రదర్శనలో తనతోపాటు ప్రముఖ నృత్య కారిణులు ముగ్గురు క్రితికా సుబ్రమణియన్, యామిని రెడ్డి, గోపికావర్మ పాల్గొంటారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ దేవత వాసవీదేవిగా కూచిపూడి కళాకారిణి యామినిరెడ్డి, కేరళ దేవత కన్నగీదేవిగా మోహినీ అట్టం నృత్యకారిణి గోపికావర్మ, తమిళనాడు దేవత ఆండాల్ దేవిగా భరత నాట్యకారిణి క్రితికా సుబ్రమణియన్, కర్ణాటక దేవత రంబాగా నటి సుహాసినీ నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారని అన్నారు. నాలుగు రాష్ట్రాల నుంచి దేవతల జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తామన్నారు. భక్తి చాటేలా ఉండే అంతరం నృత్య ప్రదర్శన చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందన్నారు.