Sita Movie Review, in Telugu | ‘సీత’ మూవీ రివ్యూ | Kajal Aggarwal | Bellamkonda Sreenivas - Sakshi
Sakshi News home page

‘సీత’ మూవీ రివ్యూ

Published Fri, May 24 2019 2:13 PM | Last Updated on Fri, May 24 2019 3:04 PM

Sita Telugu Movie Review - Sakshi

టైటిల్ : సీత
జానర్ : రొమాంటిక్‌ డ్రామా
తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌, సోనూసూద్‌
సంగీతం : అనూప్‌ రుబెన్స్‌
దర్శకత్వం : తేజ
నిర్మాత : రామబ్రహ్మం సుంకర

ఇన్నాళ్లు మాస్‌ యాక్షన్‌ హీరోగా ప్రూవ్‌ చేసుకునేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సారి కొత్తగా ప్రయత్నించాడు. లేడి ఓరియంటెడ్‌ సినిమాగా తెరకెక్కిన సీత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఘనవిజయం సాధించిన తేజ దర్శకత్వంలో కాజల్‌ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీత చిత్రంలో బెల్లంకొండ ఓ చాలెంజింగ్‌ రోల్‌లో కనిపించాడు. మరి ఈ సినిమా అయిన బెల్లంకొండకు ఆశించిన సక్సెస్‌ అందించిందా..? తేజ వరుసగా మరో సక్సెస్‌ సాధించాడా..?

కథ‌ :
సీతా మహాలక్ష్మి (కాజల్‌ అగర్వాల్‌) డబ్బుకు తప్ప మనుషులకు, బంధాలకు ఏ మాత్రం విలువ ఇవ్వని పొగరుబోతు. తండ్రితో గొడవపడి సొంతంగా బిజినెస్‌ చేసి చిక్కుల్లో పడుతుంది. తను కొన్న ఓ స్థలం సమస్యల్లో ఉండటంతో లోకల్ ఎమ్మెల్యే బసవరాజు (సోనూసూద్‌) సాయం కోరుతుంది. అయితే బసవ అందుకు బదులుగా తనతో నెల రోజులు గడపాలని అగ్రిమెంట్ రాయించుకుంటాడు. అగ్రిమెంట్‌ ముందు ఒప్పుకున్న సీత, తన పని పూర్తయిన తరువాత కాదనటంతో వ్యాపరపరంగా సీతకు అడ్డంకులు సృష్టిస్తాడు బసవ.

ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తనకు డబ్బు కావాలి. కానీ సీత తండ్రి తన ఆస్తినంత భూటన్‌లో బాబాల దగ్గర పెరుగుతున్న రఘురామ్‌ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) పేరిట రాసేస్తాడు. దీంతో ఆస్తి కోసం రామ్‌ను కలుస్తుంది సీత. చిన్నతనంలో ‘సీతను నువ్వు చూసుకోవాలి, నిన్ను సీత చూసుకుంటుంది’ అని మామయ్య చెప్పిన మాటలకు కట్టుబడిన రామ్‌, సీతతో సిటీ వచ్చేస్తాడు. అలా వచ్చిన సీతా రామ్‌లకు బసవ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు :
ఇన్నాళ్లు మాస్‌ యాక్షన్‌ హీరోగా కనిపించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. తన బాడీ లాంగ్వేజ్‌కు, ఇమేజ్‌కు ఏ మాత్రం సెట్ అవని అమాయకుడి పాత్రలో పూర్తిగా నిరాశపరిచాడు. సినిమా చూశాక అసలు ఈ సినిమాకు సాయి శ్రీనివాస్‌ ఎలా ఓకె చెప్పాడా అన్న అనుమానం రాక మానదు. హీరోయిన్‌గా సీత పాత్రకు కాజల్‌ అగర్వాల్ పూర్తి న్యాయం చేశారు. తల పొగరు ప్రదర్శించే సన్నివేశాలతో పాటు సెంటిమెంట్‌ సీన్స్‌లోనూ మెప్పించారు. విలన్‌గా సోనూసూద్‌ ఆకట్టుకున్నాడు. బసవ క్యారెక్టర్‌లో తేజ గత చిత్రాల పాత్రల ఛాయలు కనిపించినా.. సోనూ తనదైన మేనరిజమ్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇతర పాత్రల్లో మన్నార చోప్రా, భాగ్యరాజ, తనికెళ్ల భరణి, అభిమన్యూ సింగ్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేష‌ణ‌ :
సినిమా మొదలైన పది నిమిషాల్లోనే కథ అంతా చెప్పేసిన దర్శకుడు తేజ... తరువాత కథనాన్ని ముం‍దుకు నడిపించేందుకు చాలా కష్టపడ్డాడు. తన గత చిత్రాల్లోని పాత్రలు, సన్నివేశాలు చాలా రిపీట్ అయిన భావన కలుగుతుంది. కథపరంగా పెద్దగా మలుపులు లేకపోయినా కథనంలో ట్విస్ట్‌లను ఇరికించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు ఇక సినిమా అయిపోయిందని ప్రేక్షకుడు అనుకున్న ప్రతీ సారి కొత్త ట్విస్ట్‌తో షాక్‌ ఇచ్చాడు. చాలా రోజుల తరువాత సంగీత దర్శకత్వం చేసిన అనూప్‌ రుబెన్స్‌ పరవాలేదనిపించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాట్రోగఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గటుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
కాజల్‌ అగర్వాల్‌

మైనస్‌ పాయింట్స్‌ :
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌
స్క్రీన్‌ప్లే
క్లైమాక్స్‌

సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement