ఆ సినిమా తీయకుండానే మంచి పేరు వచ్చింది | Director Teja Emotional Words about Sita Movie | Sakshi
Sakshi News home page

ఆ సినిమా తీయకుండానే మంచి పేరు వచ్చింది

Published Sun, May 26 2019 1:35 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Director Teja Emotional Words about Sita Movie - Sakshi

తేజ

‘‘ఇండస్ట్రీలో శుక్రవారం నుంచి శుక్రవారానికి ఈక్వేషన్లు మారిపోతుంటాయి. శుక్రవారానికి నా సినిమా హిట్‌ అయితే నా తదుపరి సినిమాకు పెద్ద స్టార్‌ వస్తాడు. యావరేజ్‌గా ఆడితే యావరేజ్‌ స్టారే వస్తాడు. ఫ్లాప్‌ అయితే కొత్తవాళ్లతో సినిమా తీసుకోవడమే. ‘బెగ్గర్స్‌ కెనాట్‌ బీ చూజర్స్‌’ అనే సామెత ఉంటుంది ఇంగ్లీష్‌లో. అడుక్కునే వాడికి ఆప్షన్స్‌ ఉండవు అని. ప్రేక్షకుల నుంచి మన కొత్త చిత్రానికి వచ్చిన స్పందనే మన నెక్ట్స్‌ సినిమా అవుతుంది’’ అని దర్శకుడు తేజ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. అనిల్‌ సుంకర నిర్మించిన ఈ చిత్రం గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా తేజ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు.

► రామాయణానికి, మా కథకు ఏ సంబంధం లేదు. టైటిల్‌ సీత, కొన్ని డైలాగ్స్‌ చూసి అలా కొందరు ఊహించుకున్నారంతే. సీత పాత్ర ప్రస్తుత సమాజంలో ఉన్న ధన దాహం, పేరు కోసం పరిగెడుతున్న వారందరికీ ప్రతీక. న్యాయంగా, పద్ధతిగా ఉండాలి అనేది రామ్‌ పాత్ర తెలుపుతుంది. సమాజం ఎలా ఉండాలన్న దానికి ఉదాహరణ  రామ్‌ అయితే ఎలా ఉంది అన్నది సీత పాత్రలో చూపించాను. రామ్, సీత ఇద్దరికీ మధ్య జరిగే క్లాషే ఈ చిత్రకథ.

► సీత అనే పాత్ర ప్రస్తుతం ఉన్న మనుషులందర్నీ ఉద్దేశించింది. కేవలం స్త్రీలని కాదు. గట్టిగా చెప్పాలంటే స్త్రీలు ఎంతో ఫార్వార్డ్‌ థింకింగ్‌తో ఉన్నారు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కానీ మేమే సినిమాల్లో హీరోయిన్లను కేవలం హీరో వెనక పాటలు పాడుకునేట్టు చూపిస్తాం. దానికి కారణం మనం ఒక ఫార్మాట్‌ సినిమాకు అలవాటు పడి ఉండటమే. దీన్ని ఒకేసారి బద్దలుకొట్టడం కష్టం. మెల్లిమెల్లిగా జరగాలి.

► నా సినిమాలన్నింటికి రివ్యూస్‌ బావుండవు. ఆ విషయానికి నేను అలవాటు పడ్డాను. ‘సీత’ సినిమా కూడా ఫర్వాలేదని రివ్యూలు రాశారు. జనమైతే బావుంది అంటున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ కూడా రివ్యూలు డివైడ్‌గానే వచ్చాయి. కానీ సినిమా సక్సెస్‌ అయింది. మన ప్రోడక్ట్‌ను మనం జడ్జ్‌ చేయలేం. మనం ఒకటి అనుకుంటాం.. ఒకటి జరుగుతుంది. ప్రీ–రిలీజ్‌ వేడుకలో నేను తీసిన సినిమాను జడ్జ్‌ చేయడం నాకు రాదని చెప్పింది అందుకే. ఈ సినిమా ఆడుతుందో లేదో మనం చెప్పలేం. అదే తెలిస్తే ఎవ్వరం ఫ్లాప్‌ సినిమా తీయం కదా? తేజ దగ్గర నుంచి జేమ్స్‌ కామెరూన్‌ వరకూ ఎవ్వరూ ఫ్లా‹ప్‌ తీయాలనుకోరు.

► యాక్టర్స్‌ నుంచి బెస్ట్‌ రాబట్టాలంటే వాళ్లను ఆ పాత్ర మూడ్‌లోకి తీసుకెళ్లాలి.  లేకపోతే యాక్టింగ్‌ అనేది కేవలం గొంతులో నుంచి వచ్చే డైలాగ్‌తో ఆగిపోతుంది. పాత్ర మూడ్‌లోకి వెళ్తే డైలాగ్‌ కడుపులో నుంచి వస్తుంది. ప్రతీ సీన్‌ ముందు యాక్టర్‌ని హిప్నటైజ్‌ చేయాలి. అప్పుడు యాక్టర్స్‌కి ఈజీ అవుతుంది. కొన్నిసార్లు యాక్టర్స్‌కి యాక్టింగ్‌ వచ్చినా ఒక గోడ కట్టుకొని లోపల ఉండిపోతారు. చాలా మంది దర్శకులు ఆ గోడ బయట నుంచే ఏదోటి చెప్పి చేయించేస్తుంటారు. నేను మాత్రం ఆ గోడ బద్దలు కొట్టి ఆ యాక్టర్‌ను బయటకు తీసుకొచ్చి నాకు కావాల్సినట్టు చేయించుకుంటాను.

► నాకు నా పాత సినిమా ఏది చూసినా ఇంకా బాగా చేసి ఉంటే బావుండు అనిపిస్తుంటుంది. మొన్న టీవీలో ‘నువ్వు–నేను’ సినిమా వస్తుంటే చూశా. మా ఎడిటర్‌కి ఫోన్‌ చేసి ‘క్లైమాక్స్‌లో హీరోయిన్‌ గోడ దూకే దగ్గర నాలుగు ఫ్రేములు తగ్గించొచ్చు కదా?’ అన్నాను. ‘ఊరుకోవయ్యా బాబు. ఆల్రెడీ ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయిపోయింది’ అని సమాధానమిచ్చారు. నేనెప్పుడూ సంతృప్తి చెందను. ఇంకా బెటర్‌ చేయొచ్చు అనుకుంటాను.

► సినిమా కథ రాసుకున్నాక హీరో ఎవరైతే బావుంటుందని ఆలోచిస్తాను. ఈ పాత్రకు స్ట్రాంగ్‌ బాడీ ఉండి, అమాయకత్వం ఉండాలి. సాయి శ్రీనివాస్‌ బావుంటాడనిపించింది.  హీరో కంటే విలన్‌ బలంగా ఉన్నప్పుడే కథ పండుతుంది. సమస్య పరిష్కరించలేని విధంగా ఉన్నప్పుడు, నువ్వు దాన్ని ఛేదిస్తేనే నీ పవర్‌ తెలుస్తుంది. హీరోయిజమ్‌ ఎలివేట్‌ అవుతుంది. హీరో ఆల్రెడీ చాలా స్ట్రాంగ్‌గా ఉండి విలన్‌ వీక్‌ అయితే సినిమా నిలబడదు.

► ఆడియన్స్‌ మూడ్‌ బట్టి సినిమాలు ఆడతాయి. సినిమా తీసేవాళ్లం సినిమాను కేవలం ఒక ప్రోడక్ట్‌లాగా చూస్తాం. ప్రేక్షకుడికి మాత్రం చాలా కారణాలుంటాయి. మొన్న శుక్రవారం ఇంకా ఎన్నికల మూడ్‌లోనే ఉండబట్టే మార్నింగ్‌ షోలు స్లోగా స్టార్ట్‌ అయ్యాయి. నైట్‌ షో నుంచి కలెక్షన్స్‌ పెరిగాయి.  

► కథ మొదలయ్యాక పూర్తి అవ్వాలి.  పూర్తయ్యే వరకూ ఉండేదే కథ.  అది చూడకుండా క్యాలిక్యులేటర్‌ పట్టుకొని అది బావుంది, ఇది బాలే దు అని కూర్చొని లెక్కలు వేస్తే ఎలా? కామన్‌ ఆడియన్‌ మాత్రం సినిమా బావుండాలని ఆలోచనతో మాత్రమే వెళ్తాడు. మనం (రివ్యూ రైటర్స్‌ని ఉద్దేశిస్తూ) మాత్రం చెక్‌ చేయడానికి మాత్రమే వెళ్తాం. ఏది బాలేదో చూసి దర్శకుడి కంటే మనం గొప్ప అని నిరూపించుకోవడానికి సినిమా చూస్తాం. సినిమాను ఆస్వాదించాలి. సినిమానే కాదు జీవితాన్ని కూడా. పోలికలు ఆపేయాలి. ఆడు ఇది చేశాడు, ఈడు ఇది చేశాడని పోలికలు పెట్టుకుంటే కష్టం. అందుకే రివ్యూల కంటే ఆడియన్స్‌ ఏం చెబుతారన్నదే ముఖ్యం.

► నా సినిమాల్లో కథకు కావాల్సినంతే ఖర్చు పెడతాను. ప్రస్తుతం ఇండస్ట్రీ తప్పు దోవలో వెళ్లిపోతుందనిపిస్తుంది. బడ్జెట్‌ ఉందని ఖర్చు పెట్టకూడదు. కథ గుడిసె ఉండాలని అడిగితే గుడిసె ఉండాలి. బిల్డింగ్‌ ఉండకూడదు. దీనివల్ల ఖర్చు పెరిగి కథ బయటకు వెళ్లిపోతుంది.

► ప్రస్తుతం కొత్త దర్శకులు మంచి ఆలోచనలతో వస్తున్నారు. కొత్తోళ్లు వస్తే పాతోళ్లంతా పోతాం. అప్పుడే ఇండస్ట్రీ బెస్ట్‌ అవుతుంది. కొత్తవాళ్లు ఎలా వస్తారు? హై బడ్జెట్‌ సినిమాలతో కొత్తవాళ్లు రారు. అది కేవలం చిన్న సినిమాల వల్లే కుదురుతుంది. అందుకే చిన్న సినిమాలకు సపోర్ట్‌ ఇవ్వాలి. ఆదరించాలి. థియేటర్స్‌ ఇవ్వాలి.

► రామారావుగారికి న్యాయం చేయలేనని ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ నుంచి తప్పుకున్నాను. ఆ సినిమా వదిలేసి వచ్చినందుకు చాలా మంది తప్పు చేస్తున్నావు అన్నట్టు చెప్పారు. రిలీజ్‌ అయ్యాక ‘మంచి పని చేశావు’ అన్నారు. మీడియా మాత్రం నన్ను పొగిడారు. ‘తేజ తీసి ఉంటే ఇంకా బాగా వచ్చేది’ అని. సినిమా తీయకుండా మంచి పేరు వచ్చింది.

► నేనెప్పుడూ అడ్వాన్స్‌డ్‌ సినిమాలే తీస్తుంటాను. ‘చిత్రం’ సినిమా ఇప్పటికీ రిలవెంట్‌గా ఉంటుంది. కొన్నిసార్లు నేనే స్క్రిప్ట్‌లో కొంచెం డోస్‌ తగ్గించుకుంటుంటా. ఇందులో కూడా కాజల్‌ – సోనూ సూద్‌ అగ్రిమెంట్‌ కాన్సెప్ట్‌ ఫస్ట్‌ వద్దన్నారు మా వాళ్లు. కానీ నేనే పెట్టించాను. బౌండెడ్‌ స్క్రిప్ట్‌ తీసుకొనే షూటింగ్‌కు వెళ్తాను. కామెడీ వరకు ఆన్‌ లొకేషన్‌లో మార్పులు చేర్పులు చేస్తుంటాం. ఎమోషన్స్‌ను మార్చను. మారిస్తే కథ మారిపోతుంది.
► నా మూడ్‌ బాలేక బాలకృష్ణ, వెంకటేశ్‌తో చేయాల్సిన రెండు సినిమాలు ఒకే రోజు వదిలేశా. ఆ సినిమాలు వదిలేశా అని బాధపడను. అదే కాదు ఏ విషయంలోనూ రిగ్రెట్‌ ఫీల్‌ అవ్వను. నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఏంటో ఇంకా తెలియదు. ఈ సినిమా ఆడటాన్ని బట్టి ఉంటుంది.

► ‘తేజ కథలో ఎవ్వరూ చేయి పెట్టకూడదు, యాక్టర్స్‌ని కొడతాడు’ అని అనుకుంటారు.  కానీ కథ గురించి టీమ్‌ అంతా కూర్చొని మాట్లాడుకుంటాం. సినిమా తీశాక కూడా నిర్మాతలకు చూపిస్తాను. మార్పులు చెబితే వింటాను. కొడతాడనే అభిప్రాయం కూడా ఒకందుకు మంచిదైంది. టైమ్‌పాస్‌ చేసేవాళ్లు రారు. సీరియస్‌గా, సిన్సియర్‌గా ఉండేవాళ్లే వస్తారు.

► మన జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అందరికీ పని దొరకడం లేదు. దాంతో కొందరు సినిమాలను ఆపేయాలి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అన వివాదం చేయడానికి ఓ పనిగా పెట్టుకుంటున్నారు. పని ఉండి ఉంటే ఇవన్నీ పట్టించుకోడు ఎవ్వడూ. ఇండియాలో వెబ్‌సైట్‌లు చూస్తూ కూర్చునేవాళ్లు ఎక్కువ. అందుకే యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా, చైనా మీద దృష్టి పెడుతుంటాయి. మేం తీసే పిచ్చివో, మంచివో సినిమాలకు కలెక్షన్స్‌ ఎందుకు ఇంత వస్తున్నాయి? ఎక్కువ మంది సినిమా చూస్తున్నారు కాబట్టే. ఖాళీగా ఉండేవాళ్లే మాకు దేవుళ్లు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement