వారితో రాజీ కుదిరిందా?
విజయాలు తమ వెంటే సమస్యలను తెచ్చిపెడతాయన్నది నటుడు శివకార్తికేయన్ విషయంలో మరోసారి రుజువైంది. మాన్‌కరాటే, రజనీమురుగన్, రెమో అంటూ వరుస విజయాలతో మరో స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయిన నటుడు శివకార్తికేయన్. అలాంటి నటుడే రెమో చిత్ర సక్సెస్ మీట్ వేదికపై తమ పని తమను చేసుకోనివ్వండి అంటూ కంట తడిపెట్టారు. అదే శివకార్తికేయన్‌పై ముగ్గురు నిర్మాతలు ఫిర్యాదు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. యువ నిర్మాత జ్ఞానవేల్‌రాజా అయితే శివకార్తికేయన్ తనకు చిత్రం చేయకపోతే తనకు ఆత్మహత్య మినహా వేరే దారి లేదని అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం హల్‌చల్ చేస్తోంది.
వీటికి సంబంధించి వివరాల్లోకెళ్లితే శివకార్తికేయన్ రెమో చిత్రానికి ముందే స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్‌రాజాకు, ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్, వేందర్ మూవీస్ సంస్థకు చిత్రాలు చేస్తానని అడ్వాన్‌సలు తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది.అయితే తాను స్టూడియోగ్రీన్ సంస్థ నుంచి మినహా వేరే సంస్థ నుంచి అడ్వాన్‌స తీసుకోలేదని శివకార్తికేయన్ స్పష్టం చేశారు.అయితే పైన చెప్పిన మూడు సంస్థల నిర్మాతలు తమిళ నిర్మాతల మండలిలో నటుడు శివకార్తికేయన్‌పై ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై నిర్మాతల మండలి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం.
శివకార్తికేయన్ ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసి స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజాకు ఒక చిత్రం,ఆ తరువాత ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్, వేందర్ మూవీస్ సంస్థలకు కలిసి ఒక చిత్రం చేసే విధంగా రాజీ కుదిరినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.అయితే ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా వెల్లడించలేదన్నది గమనార్హం.