
SivaKarthikeyan Files Petition Against KE Gnanavel Raja: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కోర్టు మెట్లెక్కాడు. ప్రముఖ నిర్మాత కె. ఇ. జ్ఞానవేల్ రాజా తనకు రెమ్మ‍్యునరేషన్ ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తామని జూలై 6, 2018న ఒప్పందం చేసుకుని, రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపాడు. మూడేళ్లైనా రూ. 4 కోట్లు ఇవ్వలేదన్నాడు. ఇచ్చిన రూ. 11 కోట్లకు కూడా టీడీఎస్ కట్టలేదని, రూ. 91 లక్షలు టీడీఎస్ కింద కట్ అయ్యాయని పేర్కొన్నాడు. తన కేసు పరిష్కారమయ్యే వరకూ నిర్మాత జ్ఞాన్‌వేల్ రాజా తన తదుపరి సినిమాలైన 'రెబల్', 'చియాన్ 61', 'పాతు తాల'కు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని కోర్టును కోరాడు శివ కార్తికేయన్.
అలాగే ఈ సినిమాలకు సంబంధించి థియేట్రికల్ రిలీజ్ కోసం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌లకు, లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఎలాంటి హక్కులు బదిలీ చేయకుండా చూడాలని అభ్యర్థించాడు. ఈ కేసు మళ్లీ గురువారం విచారించనున్నారు. కాగా శివకార్తికేయన్.. రెమో, హీరో, వరుణ్ డాక్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల 'బీస్ట్' మూవీ నుంచి అదరగొట్టిన సూపర్ హిట్ సాంగ్ 'అరబిక్ కుతు'కు లిరిక్స్ అందించాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లల్ 'అయాలాన్' విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి రవి కుమార్ దర్శకత్వం వహించారు.