సినిమాలో విలనిజం బాగా పండితేనే హీరోయిజం ఎఫెక్టివ్‌గా కనిపిస్తుంది. అందుకే సినిమాల్లో హీరోలెంత ముఖ్యమో విలన్లు కూడా అంతే ముఖ్యం. ఇక ఫైట్ సీన్లలో వారు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఎంత కష్టమైనా పడతానంటున్నాడు విలన్ రెమో అలియాస్ రహీమ్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విలన్‌గా రాణిస్తున్నాడు రెమో. ఇప్పటివరకు దాదాపు వందకుపైగా సినిమాల్లో నటించాడు. 18 ఏళ్లలో దాదాపు ప్రధాన హీరోలందరితోనూ నటించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి ఉండేది. వెంకీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పొద్దున్నుంచి రాత్రివరకు అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాను. నన్ను గమనించిన రవితేజ.. టెర్రరిస్టువా? ఏంది? అలా చూస్తున్నావని అడిగితే యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పాను. సినిమాలు చేయాలంటే మంచి బాడీ ఉండాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి అని చెప్పాడు. నేను ఏడ్చుకుంటూ వెళ్తుంటే రవితేజ పిలిచి తన నెంబర్ ఇచ్చాడు. ఫిట్‌గా అయి, యాక్టింగ్ నేర్చుకున్నాక ఫోన్ చేయమన్నాడు. ఆ నెంబర్ వల్లే నేనీ స్థాయికి వచ్చాను.
మహేశ్‌బాబు, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా దాదాపు అందరు హీరోలతోనూ సినిమాలు చేశా. డీజే షూటింగ్‌లో ఓ ఫైట్ సీన్‌లో అల్లు అర్జున్‌కు, నాకు గాయాలయ్యాయి. నేను బాగా కష్టపడ్డానని నన్ను పోస్టర్లలో వేయించారు. ఆ పోస్టర్ వైరల్ అవడంతో తర్వాత 35 సినిమాలు చేశా. పుష్ప 2లో ఆయనతో మళ్లీ కనిపిస్తా. మొదటిసారి మెగాస్టార్‌తో కలిసి నటిస్తున్నా. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో నటించే ఛాన్స్ వచ్చింది. కాకపోతే అప్పుడు నా జీవితంలో ఓ విషాదం జరిగింది. నా భార్య, బాబుకు ఆరోగ్యం బాలేకపోతే ఆస్పత్రిలో జాయిన్ చేశాను. బాబును ఐసీయూలో ఉంచారు. ఆరోజు నన్ను వాల్తేరు వీరయ్య షూటింగ్‌కు పిలిచారు. వెళ్లకపోతే ఛాన్స్ మిస్ అవుతుందేమోనన్న భయంతో వెళ్లాను, డైలాగ్స్ చెప్పాను. ఇంతలో బాబు చనిపోయాడంటూ ఫోన్ కాల్.. ఫస్ట్ డే షూటింగ్... ఉండాలా? వెళ్లిపోవాలా? అర్థం కాలేదు. షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లాను. నెక్స్ట్ డే కూడా సెట్స్‌కు వెళ్లాను' అంటూ విషాద ఘటనను పంచుకున్నాడు విలన్ రెమో.
Comments
Please login to add a commentAdd a comment