ఆరు వందల కోట్లు.. అయినా నో!
‘జేమ్స్‌బాండ్‌గా నటించడం కన్నా చేతి మణికట్టును కోసుకుని చావడం బెటర్’ అని హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 24 బాండ్ చిత్రాలు వస్తే.. ఆ మధ్య విడుదలైన ‘స్పెక్టర్’తో కలిపి నాలుగు చిత్రాల్లో టైటిల్ రోల్ చేశారు డేనియల్. మరి.. యాక్షన్ సన్నివేశాలు రిస్క్ అనుకున్నారో ఏమో.. ఇక బాండ్‌గా నటించనని ప్రకటించారు. ఈ నేపథ్యంలో 25వ బాండ్ చిత్రానికి బాండ్‌గా టామ్ హిడెల్‌స్టన్‌ని ఎంపిక చేశారని సమాచారం. అయితే అంతకన్నా ముందు డేనియల్‌ని ఓసారి కన్విన్స్ చేయడానికి దర్శక-నిర్మాతలు శామ్ మెండెస్, బార్‌బరా బ్రోకోలి ట్రై చేశారట.
ఎక్కువ మొత్తం ఆశ జూపితే కచ్చితంగా డేనియల్ నిర్ణయం మార్చుకుంటారన్నది వాళ్ల ఊహ. అందుకే ఏకంగా 100 మిలియన్ డాలరుల(మన కరెన్సీలో సుమారు 674 కోట్లు) ఆఫర్ చేశారట. అంత పారితోషికం అన్నప్పటికీ డేనియల్ మనసు చలించలేదట. బతికుంటే నాలుగు సినిమాలు చేసుకోవచ్చు.. రిస్క్ తీసుకుని, ప్రమాదంలో పడటం ఎందుకు? అని సన్నిహితులతో చెప్పుకున్నారట. అందుకే, అంత డబ్బుని కాదనుకున్నారు.
బాండ్ సినిమాల్లోని రిస్కీ యాక్షన్ సీక్వెన్సెస్ కారణంగా డేనియల్‌కు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయట. అందుకే డబ్బు కన్నా ఆరోగ్యమే మిన్న అనే సూత్రాన్ని ఫాలో అయిపోయారు. మరి.. టామ్ హిడెల్‌స్టన్‌కి ఎంత పారితోషికం ఇస్తున్నారన్నది తెలియాల్సి ఉంది. కచ్చితంగా డేనియల్‌కి ఆఫర్ చేసినంత అయితే ఇవ్వరు. ఎందుకంటే.. టామ్‌కి ఇది తొలి బాండ్ సినిమా. జేమ్స్ బాండ్‌గా మార్కులు కొట్టేయడానికి టామ్ కసరత్తులు చేస్తున్నారట.