తెరపై విలన్‌ని హీరో రఫ్ఫాడిస్తుంటే ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. అందుకే యాక్షన్ సీన్స్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని సినిమాల కోసం ట్రైన్‌లో ఫైట్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు. ట్రైన్‌లో రిస్కీ యాక్షన్ సీన్స్ చూపించనున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.
ట్రైన్‌లో భారతీయుడు
దర్శకుడిగా శంకర్ పరిచయమైన తొలి సినిమా ‘జెంటిల్‌మేన్’. ఈ సూపర్‌డూపర్ హిట్ ఫిల్మ్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే... శంకర్ దర్శకత్వం వహించిన ఆ తర్వాతి చిత్రాల్లో రజనీకాంత్ ‘రోబో’, విక్రమ్ ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) వంటి వాటిలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ట్రైన్ యాక్షన్ సీక్వెన్సెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు శంకర్.
1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల తర్వాత కమల్, శంకర్ కాంబోలోనే ‘ఇండియన్’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. అక్కడ దాదాపు రెండు వారాలపాటు షూటింగ్‌ని ΄్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లోనే ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట శంకర్. ఫారిన్ ఫైటర్స్, ఫారిన్ యాక్షన్ మాస్టర్స్ ఈ ఫైట్‌ను డిజైన్ చేయనున్నట్లు సమాచారం. ‘ఇండియన్ 2’లో ఉన్న మేజర్ హైలైట్స్‌లో ఇదొకటనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.
పది కోట్ల ఫైట్
ఒకవైపు కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తూనే మరోవైపు రామ్‌చరణ్‌తో ‘సీఈవో’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా చేస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్‌ని యాక్షన్ సీన్‌తోనే ఆరంభించారు. భారీ స్థాయిలో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు దర్శకుడు శంకర్. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో వందమందికి పైగా ఫైటర్స్ పాల్గొన్నారని, ఈ ఫైట్ ఖర్చు రూ. పది కోట్లు పైనే అనే టాక్ వినిపిస్తోంది.
మరి.. ఈ ఫైట్ ఏ విధంగా ఉంటుందనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నెల 27న రామ్‌చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్.
నాగేశ్వరరావు దోపిడీ
స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ లుక్‌లో రవితేజ రైలు పట్టాలపై ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథ రీత్యా ట్రైన్‌లో నాగేశ్వరరావు దోపీడీ చేసే సీన్ అట అది. ట్రైన్‌లో చిన్నపాటి యాక్షన్ టచ్ కూడా ఉంటుందట. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.
డెవిల్ పోరాటం
స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1945లో బ్రిటిష్‌వాళ్ళు పరిపాలించిన మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో జరిగే కథతో రూపొందుతున్న చిత్రం ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌పోస్టర్‌లో కల్యాణ్ రామ్ ఓ ట్రైన్‌పై ఉన్నట్లు కనిపిస్తుంది. యాక్షన్ సీన్‌లో భాగంగా ఈ ట్రైన్ వస్తుందని తెలుస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
బొగ్గు దొంగ
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల సమీపంలో గల ఓ కల్పిత గ్రామంలో జరిగే కథగా రూపొందిన చిత్రం ‘దసరా’. ఇందులో మద్యానికి బానిస అయి, బొగ్గు దొంగతనం చేసే ధరణి పాత్రలో కనిపిస్తారట నాని. ఇటీవల విడుదలైన ‘దసరా’ ట్రైలర్‌లో బొగ్గు ఉన్న గూడ్స్ ట్రైన్‌పై నాని ఉన్న సీన్ కనిపిస్తుంది. ఇది ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ అని టాక్. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.
లోకల్ ట్రైన్‌లో ఏజెంట్
లోకల్ ట్రైన్‌లో ఫైట్స్ చేశారట అక్కినేని అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. గత ఏడాది వేసవిలో ‘ఏజెంట్’ షూటింగ్ హైదరాబాద్ మెట్రో రైల్‌లో జరిగింది. ట్రైన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా సురేందర్ రెడ్డి చిత్రీకరించారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది.
ఎనిమిది కోట్ల యాక్షన్
సూరి, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విడుదలై’. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘విడుదలై పార్ట్ 1’ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు వెట్రిమారన్ ఓ భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌ను తీశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఖర్చు దాదాపు రూ. 8 కోట్లు అని సమాచారం. కాగా ‘విడుదలై’ రెండో భాగం విడుదలపై కూడా త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment