‘తారాజువ్వ’లా.. తారక్‌ సినీ కెరీర్‌! | Some Interesting Things About Jr NTR On The Occasion Of His Birthday | Sakshi
Sakshi News home page

Published Sun, May 20 2018 2:07 PM | Last Updated on Sun, May 20 2018 3:35 PM

Some Interesting Things About Jr NTR On The Occasion Of His Birthday - Sakshi

అసలు పేరు ‘నందమూరి తారక రామరావు జూనియర్‌’...కానీ అభిమానులు మాత్రం ‘యంగ్‌ టైగర్‌’గా పిలుచుకుంటారు. మాస్‌ ఇమేజ్‌కు నిలువెత్తు నిదర్శనంలా ఎదిగిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. 35వ పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా శనివారం విడుదల చేసిన ‘అరవింద సమేత’ ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. ఫస్‌లుక్‌లో ఎన్టీఆర్‌ కత్తి పట్టుకుని, సిక్స్‌పాక్‌ బాడీతో పవర్‌ బ్యాంక్‌లా, మాస్‌ హీరోకు నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్నాడు. అయితే ఈ కొత్త లుక్‌ కోసం తారక్‌ ఎంతో శ్రమించాడు. ఎంతోమంది బాలీవుడ్‌ టాప్‌  హీరోలకు ఫిజికల్‌ ట్రైనర్‌గా పనిచేసిన లాయిడ్‌ స్టీవెన్స్‌ శిక్షణలో యంగ్‌టైగర్‌ రాటుదేలాడు. తారక్‌ ఫిజక్‌ గురించి మాట్లాడుకోవాలంటే యమదొంగకు ముందు...యమదొంగ తర్వాత అనే చెప్పాలి. ఎందుకంటే యమదొంగ ముందువరకూ ఈ హీరో దాదాపు 100 కేజీల బరువుతో ఉండేవాడు. ఆ తర్వాత 20 కేజీల బరువు తగ్గి చాలా స్టైలిష్‌గా తయారయ్యాడు. నేటితో 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ హీరో సినీ జీవితాన్ని ఓ సారి చూద్దామా....

భారీ సినీ నేపథ్యం..
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు లేనటువంటి భారీ సినీ నేపథ్యం ఎన్టీఆర్‌కు సొంతం. తాతగారి పేరు పెట్టుకుని యాక్టింగ్‌, డాన్స్‌తో దూసుకుపోతున్న ఈ హీరో ప్రేక్షకుల హృదయాల్లో ‘జూనియర్‌ ఎన్టీఆర్‌’గా స్థానం సంపాదించుకున్నాడు.

చిన్న వయసులోనే పరిశ్రమలోకి...
బన్నీ, రామ్‌ చరణ్‌ కంటే ముందే పరిశ్రమకు వచ్చాడు తారక్‌. తొలిసారిగా 1996 ‘బాల రామాయణం’ చిత్రంలో రాముడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ ఐదేళ్లలోనే అంటే 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. తర్వాత  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్‌ నం.1’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ‘ఆది’ సినిమా తారక్‌లోని మాస్‌ హీరోను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ యంగ్‌ టైగర్‌ కెరీర్‌ ఆశించినంత బాగా సాగలేదు. అల్లరి రాముడు, నాగ లాంటి రెండు డిజాస్టర్ల తరువాత ‘సింహాద్రి’ రూపంలో జక్కన్నే మరోసారి ఎన్టీఆర్‌కు భారీ విజయాన్ని ఇచ్చాడు. తరువాత అశోక్‌, సాంబ, నాగ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మరోసారి గట్టెక్కించిన జక్కన్న...
ఇలా ఆరేళ్లపాటు కొనసాగిన తారక్‌ సిని ప్రస్థానాన్ని ‘దర్శక ధీరుడు’ రాజమౌళి మరోసారి మలుపు తిప్పాడు. 2007లో రాజమౌళి తారక్‌తో ‘యమదొంగ’ సినిమాను తీసాడు. ఈ సినిమా కోసం జూనియర్‌ 20 కేజీల బరువు తగ్గి, కొత్త లుక్‌తో ఆకట్టుకోవడమే కాక నటనలో తాతకు తగ్గ మనవడిగా నిరుపించుకున్నాడు. సీనియర్‌ ఎన్టీఆర్‌ యమగోలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపితే.. తాతకు తగ్గ మనవడిగా జూనియర్‌ యమదొంగతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాడు.

‘టెంపర్‌’ చూపించాడు....
యమదొంగ తర్వాత అదుర్స్‌, బృందావనం లాంటి సినిమాలతో ఘనవిజయాలు సాధించిన ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్‌’ సినిమాతో మరోసారి సరికొత్తగా తనని తాను ఆవిష్కరించుకున్నాడు.. అవినీతి పోలీసు అధికారి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పూరీ, ఎన్టీఆర్‌లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఎన్టీఆర్‌ యాక్టింగ్‌, పూరి మార్క్‌ పంచ్‌ డైలాగ్‌లతో టెంపర్‌ మంచి విజయాన్ని అందుకుంది.

జనతా గ్యారేజ్‌తో కొత్తగా...
టెంపర్‌ తర్వాత సినిమాల ఎంపికలో తారక్‌లో చాలా మార్పు వచ్చింది. రొటిన్‌కు భిన్నంగా, కథాబలం ఉన్న చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే సమయంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇలా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌, జైలవకుశ సినిమాలతో వరుస విజయాలందుకున్నాడు తారక్‌.


ప్రస్తుతం ఈ యంగ్‌టైగర్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement