రజనీ సార్ చప్పట్లు నాలో ఉత్సాహాన్ని పెంచాయి
‘‘రజనీ సార్, నాన్న.. మంచి స్నేహితులు. వారిద్దరూ కలిసి హిందీలో నటించారు కూడా. అయిదారేళ్ల క్రితం చెన్నయ్‌లో రజనీసార్‌నీ, ఆయన కుమార్తె సౌందర్యను కలిశాను. ఇప్పుడు ఏకంగా రజనీ సార్ సరసనే నటిస్తానని అప్పుడు ఊహించలేదు’’ అన్నారు సోనాక్షీ సిన్హా. హిందీలో కథానాయికగా మంచి స్థానంలో ఉన్న సోనాక్షీని దక్షిణాది చిత్రాల్లో నటింపజేయడానికి పలువురు దర్శక, నిర్మాతలు ప్రయత్నం చేశారు. చివరికి ‘లింగా’తో అది నెరవేరింది. వచ్చే నెల 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో అనుష్క, సోనాక్షీ నాయికలుగా నటించారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక చెన్నయ్‌లో జరిగింది. ఈ సందర్భంగా సోనాక్షీతో జరిపిన ఇంటర్వ్యూ....
మీకు తెలుగు తెలుసా?
తెలుగే కాదు తమిళం కూడా తెలియదు.
మరి.. ‘లింగా’లో నటించేటప్పుడు భాష సమస్య రాలేదా?
భాష సమస్య వచ్చింది గానీ, యూనిట్ సభ్యుల సహకారంతో ఆ సమస్యను అధిగమించగలిగాను. ముఖ్యంగా దర్శకుడు కేఎస్ రవికుమార్ సహకారం, రజనీ సార్ ప్రోత్సాహం మరువలేనిది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి మీరేం చెబుతారు?
ఒక్క మాటలో చెప్పాలంటే రజనీసార్ లాంటి నటులు చాలా అరుదుగా ఉంటారు. ఎంత నిరాడంబరత... ఎంత సౌమ్యం. ఎదుటివారిని గౌరవించడంలో ఆయనకు ఆయనే సాటి. సో స్వీట్ పర్సన్. తానొక సూపర్‌స్టార్‌ననే భావన రజనీ సార్‌లో ఏ మాత్రం కనిపించదు.
సూపర్ స్టార్ సరసన నటించే అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది?
చాలా ఎగ్జయిట్ అయ్యాను. ‘రజనీ సార్‌కు జంటగా’ అనగానే నాన్న కూడా మంచి అవకాశం అంగీకరించమన్నారు. నా స్నేహితురాలు దీపికా పదుకొనె ‘కోచ్చడయాన్’ చిత్రంలో రజనీ సార్‌తో కలిసి నటించింది కదా. ఆ టైమ్‌లో ఆయన వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్పేది. దాంతో రజనీ సార్‌తో నటించాలనే ఆసక్తి పెరిగింది. ఈ అవకాశం రావడం నిజంగా అదృష్టమే. రజనీ సార్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఇందులో మీ పాత్ర గురించి?
1940లో జరిగే కథలో రజనీ సార్‌కు అర్ధాంగిగా నటించాను. చాలా సంప్రదాయబద్ధమైన పాత్ర. గ్లామర్ లేకపోయినా, సింపుల్‌గా కనిపించే పాత్ర. కథకి కీలకమైనది.
ఈ చిత్రంలో నటించిన మరో నాయిక అనుష్క గురించి?
మా ఇద్దరి కాంబినేషన్‌లో సన్నివేశాలు లేవు. ఇంకా చెప్పాలంటే నేనిప్పటి వరకు అనుష్కను ప్రత్యక్షంగా చూడలేదు. ఈ ఆడియో వేడుకలో చూడటమే. అయితే ఆమె నటించిన ‘అరుంధతి’ చిత్రం చూశాను. ఆ చిత్రంలో ఆమె అభినయం అద్భుతం.
హిందీ రంగంలో మీకిష్టమైన నటుడు?
సల్మాన్‌ఖాన్. నిజం చెప్పాలంటే నటిగా నాకు స్పూర్తి ఆయనే. సల్మాన్‌తో కలసి నటించడం మంచి అనుభవం.
దక్షిణాదిలో రజనీకాంత్ కాకుండా ఇంకా ఎవరితో నటించాలని కోరుకుంటున్నారు?
ఇష్టమైన నటులు చాలామంది వున్నారు. సూర్య, మహేష్‌బాబు, రవితేజలతో నటించాలనుకుంటున్నాను.
తెలుగులో మీకు అవకాశాలు వచ్చినా అంగీరించలేదేం?
కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడంవల్ల అంగీకరించలేదు. దక్షిణాదికి చెందిన ఒక్కడు, పోకిరి, విక్రమార్కుడు, తుపాకీ తదితర చిత్రాల హిందీ రీమేక్‌లో నేనే నాయికను. అలాగే దక్షిణాదికి చెందిన ప్రభుదేవా, ఎ.ఆర్. మురుగదాస్, నటరాజ్ వంటి దర్శకులతో పని చేశాను. తాజాగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం చేయనున్నాను.
నటన విషయంలో మీ తల్లి పాత్ర ఎంత?
అమ్మ పాత్ర చాలా ఉంది. ఆమె ప్రోత్సాహం లేనిదే నేనీ స్థాయికి చేరేదాన్నే కాదు. ముఖ్యంగా నాపై అమ్మ చూపే శ్రద్ధ గురించి చెప్పడానికి మాటలు చాలవు.
- సాక్షి, చెన్నయ్