
సూపర్‌స్టార్ కోసమే
ఒక్కో సారి ఇష్టం లేకపోయినా కష్టమయినా కొన్ని కార్యాలు చేయకతప్పని పరిస్థితి ఎదురవుతుంది. నటి సోనాక్షి సిన్హా ప్రస్తుతం సరిగ్గా ఇలాంటి పరిస్థితు ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా విరాజిల్లుతున్న బ్యూటీ సోనాక్షి సిన్హా. సాధారణంగా హిందీ హీరోయిన్లు అనగానే ఉండీలేనట్లుండే నాజుకైన నడుము అందాలతో మెరుపుతీగల్లా ప్రకాశిస్తుంటారు. అయితే ఇలాంటి వర్ణనకు పూర్తి విరుద్ధమైన బాడీలాంగ్వేజ్, బొద్దుగా ముద్దుగా చిరునవ్వు వికసించే నగుమోము సోనాక్షి సిన్హాకు చిరునామా. సన్నిహితులెవరయినా కాస్త బరువు తగ్గించవచ్చుగా అంటే వెంటనే నేనిలానే ఉంటాను. సన్నగా మారడం నాకిష్టం ఉండదు అంటారు సోనాక్షి సిన్హా. ఆ మధ్య ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఆర్.రాజ్‌కుమార్ చిత్రంలో సోనాక్షి సిన్హా మరీ గుమ్మడికాయలా ఉన్నారంటూ విమర్శించేవారు లేకపోలేదు. అలాంటిది ఆశ్చర్యంగా ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం స్లిమ్‌గా తయారయ్యే పనిలో పడ్డారు. నిత్యం జిమ్, ఆహారపు కట్టుబాట్లు అంటూ నాజూగ్గా తయారవ్వడానికి కసరత్తులు చేస్తున్నారు.
ఇదంతా మన సూపర్‌స్టార్ రజనీకాంత్ కోసమే నట. కోచ్చడయాన్ చిత్రం మే నెల తొమ్మిదిన తెరపైకి రానుంది. రజనీకాంత్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో సూపర్ స్టార్ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా అందాల తార అనుష్క ఇప్పటికే ఎంపికయ్యారు. మరో హీరోయిన్‌గా సోనాక్షి సిన్హా నటించనున్నారు. ఈ చిత్రంలో ఈ అమ్మడు అనుష్క అందంతో పోటీ పడటానికి తన శారీరక అందాలను మెరుగు పర్చుకుంటున్నారు. ఇకపై ఇలానే స్లిమ్‌గా బాడీని మెయింటెయిన్ చేస్తారా? అన్న ప్రశ్నకు నోనో నిండయిన శరీరందాలతో ఎప్పుడూ పుష్టిగా ఉండటమే తనకిష్టం. మళ్లీ యథాస్థితికి వచ్చేస్తానంటున్నారు నటి సోనాక్షి సిన్హా.