
క్యాన్సర్ వ్యాధి చికిత్సలో భాగంగా కీమోథెరపీ కోసం న్యూ యార్క్ వెళ్లిన సోనాలి బింద్రే ఇటీవల ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం న్యూ ఇయర్ మాత్రమే కాదు సోనాలి పుట్టినరోజు కూడా. ఆమె బర్త్‌డే వేడుకలు బంధుమిత్రుల మధ్య జరిగాయి. సునైనా ఖాన్, మలైకా అరోరాఖాన్, అర్జున్ కపూర్, సంజయ్ కపూర్, కునాల్ కపూర్, గాయత్రి ఒబెరాయ్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనాలి భర్త గోల్డీ బెహల్ ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.
‘‘జీవితంలో మీ జీవిత భాగస్వామి మీకు మంచి ఫ్రెండ్‌గా, ప్రతిబింబంగా, సపోర్ట్‌గా, స్ఫూర్తిగా ఉండాలంటారు. వాటన్నింటికంటే ఎక్కువే నువ్వు నాకు ఇచ్చావ్. 2018కి నీకు చాలా కష్టంగా గడిచిన ఏడాది. కానీ కష్టాన్ని నువ్వు ఎదుర్కొన్న తీరు నన్ను గర్వపడేలా చేస్తోంది. నన్ను నాకు మరింత పరిచయం చేశావ్. నీ సానుకూల దృక్పథమైన ఆలోచన ధోరణి ఇంకా పెరగాలి. నువ్వు నీలా ఉన్నందుకు థ్యాంక్స్. ఈ ఏడాది నీ జీవితంలో అద్భుతమైన సంతోషాలను తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే సోనాలి’’ అని పేర్కొన్నారు గోల్డీ.