ఆ ఐదుగురితో డెరైక్షన్ చేస్తానంటున్న సోనమ్!
పులి కడుపున పులే పుడుతుంది. అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ అదే నిరూపించారు. చాలా తక్కువ సమయంలోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్నారామె. అయితే ఆమె దానితోనే సంతృప్తిపడదలచుకోలేదు. మెగాఫోన్ పట్టే ఆలోచనలో కూడా ఆమె ఉన్నారు. ఇంతకీ సోనమ్ ఎప్పుడు డెరైక్టర్ అవుతారు? కథలు రెడీ చేసుకున్నారా? డెరైక్టర్ అయ్యాక ఏయే కథానాయికలతో సినిమాలు తీయాలనుకుంటున్నారు?.. ఆ విషయాలు తెలుసుకుందాం...
* కథానాయికగా అడుగుపెట్టే ముందు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర సోనమ్ కపూర్ దర్శకత్వ శాఖలో చేశారు. మూడేళ్ల పాటు ఆయన దగ్గర డెరైక్షన్ నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. అంతకు ముందు సింగపూర్‌లో యునెటైడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్-ఈస్ట్ ఏషియాలో థియేటర్‌లో అండ్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అక్కడ డెరైక్షన్, రైటింగ్ నేర్చుకున్నారు.
* సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్లాక్’ చిత్రానికి సోనమ్ దర్శకత్వ శాఖలో చేశారు. ఆ సినిమా చేస్తున్నప్పుడే భన్సాలీ తన తదుపరి చిత్రం ‘సావరియా’లో హీరోయిన్‌గా నటించమని సోనమ్‌ని అడిగారు. అప్పుడు ఈ బ్యూటీ దాదాపు 80 కిలోల బరువు ఉండేవారు. ‘సావరియా’లో నటించడం కోసం 35 కిలోలు తగ్గారు. మొదటి చిత్రంతోనే తన అందచందాలు, అభినయంతో అందర్నీ ఆకట్టుకుని, క్రేజీ హీరోయిన్ అయిపోయారు సోనమ్. అక్కణ్ణుంచి వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు.
* కథానాయికగా బిజీ అయినప్పటికీ డెరైక్షన్ చేయాలనే తన లక్ష్యాన్ని సోనమ్ మర్చిపోలేదు. వీలు కుదిరినప్పుడల్లా రకరకాల కాన్సెప్టులు అనుకుంటున్నారు. కొన్ని కథలు కూడా రాసుకున్నారు. రొమాంటిక్ మూవీస్ అంటే సోనమ్‌కు చాలా ఇష్టం. ఆ తరహా చిత్రాలు, కామెడీ మూవీస్‌ని తెరకెక్కించాలనుకుంటున్నారామె. మరో ఐదు, పదేళ్లల్లో మెగాఫోన్ పట్టుకోవాలనుకుంటున్నారు.
* ఓ దర్శకురాలిగా ఏయే కథానాయికలతో సినిమాలు చేయాలో కూడా సోనమ్ ఓ జాబితా రాసుకున్నారు. ఆ జాబితాలో దీపికా పదుకొనె, అనుష్కా శర్మ, పరిణీతి చోప్రా, ఆలియా భట్, స్వర భాస్కర్ ఉన్నారు. ఈ ఐదుగురూ చాలా టాలెంటెడ్ అనీ, ఎలాంటి పాత్రలో అయినా నటింపజేయవచ్చని సోనమ్ అంటున్నారు. ‘‘వీళ్ల పేర్లు చెప్పినంత మాత్రాన మిగతా కథానాయికలు వేస్ట్ అని నా ఉద్దేశం కాదు. అందరూ ప్రతిభావంతులే. అందుకని మిగతావాళ్లతో కూడా సినిమాలు చేస్తా’’ అంటున్నారు సోనమ్. మొత్తం మీద సోనమ్ చెబుతున్న మాటలు చూస్తుంటే డెరైక్షన్‌ని ఆమె సీరియస్‌గానే తీసుకున్నారని అనిపిస్తోంది.
హిందీలో మీరా నాయర్, దీపా మెహతా, ఫరా ఖాన్, నందితా దాస్ వంటి లేడీ డెరైక్టర్స్ ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ల జాబితాలో సోనమ్ చేరతారు. అయితే, వాళ్లందరూ వేరు. సోనమ్ వేరు. కమర్షియల్ చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకున్న కేటగిరీలో ఉన్న తార సోనమ్. సో.. సోనమ్ నుంచి ఎలాంటి చిత్రాలు వస్తాయి? నటిగా పేరు తెచ్చుకున్న సోనమ్ దర్శకురాలిగా కూడా భేష్ అనిపించుకుంటారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.