‘రేపు మీ పిల్లల విషయంలో ఏం చేస్తారు’ | Soni Razdan Reacts Strongly To Nepotism Backlash Over Alia Bhatt | Sakshi
Sakshi News home page

విమర్శకులపై ఆగ్రహం.. నటికి మద్దతిచ్చిన తల్లి

Published Wed, Jun 24 2020 3:11 PM | Last Updated on Wed, Jun 24 2020 3:54 PM

Soni Razdan Reacts Strongly To Nepotism Backlash Over Alia Bhatt - Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అకాల మరణంతో సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన బంధుప్రీతి, లాబీయింగ్, అభిమానవాదం వంటి అంశాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. సుశాంత్ మరణం తరువాత చాలా మంది నటులు, దర్శకులు, రచయితలు, ఇతర వర్ధమాన నటులు బాలీవుడ్‌లో తాము ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు కరణ్ జోహార్, ఆలియా భట్, సోనమ్ కపూర్, సల్మాన్ ఖాన్‌లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ట్రోలర్స్‌ బాధ తట్టుకోలేక కరణ్, ఆలియా, కరీనా కపూర్ ఖాన్‌ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో కామెంట్‌ సెక్షన్‌లో లిమిట్‌ సెట్‌ చేసుకున్నారు.

సుశాంత్ మరణం తర్వాత అభిమానులు బాలీవుడ్‌లో బంధుప్రీతిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక కరణ్‌, అలియా వంటి స్టార్లను అన్‌ఫాలో చేయడం ప్రారంభించారు. దాంతో వీరి సోషల్‌ మీడియా ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఆలియా భట్‌పై వస్తున్న విమర్శలపై ఆమె తల్లి సోని రజ్దాన్‌ స్పందించారు. ఈ రోజు బంధుప్రీతి గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారు.. రేపు తమ పిల్లలు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే మాత్రం వారికి తప్పక మద్దతిస్తారని ఎద్దేవా చేశారు. దర్శకుడు హన్సాల్ మెహతా చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ సోని ఇలా కామెంట్‌ చేయడం గమనార్హం. (ముసుగులు తొలగించండి)

హన్సాల్‌ మెహతా ‘ఈ బంధుప్రీతిపై చర్చను విస్తృతం చేయాలి. ఎక్కువ మంది దీని గురించి మాట్లాడాలి. నా వల్ల నా కొడుకుకు ఇండస్ట్రీలో త్వరగా అవకాశం లభించిన మాట వాస్తవం. కాకపోతే తను చాలా కష్టపడి పని చేస్తాడు. ప్రతిభావంతుడు, క్రమశిక్షణ గలవాడు. నాలానే  విలువలు పాటిస్తాడు. అందువల్లే అతడికి అవకాశాలు వస్తాయి తప్ప నా కొడుకు అని అవకాశాలు ఇవ్వరు’ అన్నారు. అంతేకాక ‘నా కుమారుడు సినిమాలు తీస్తాడు.. కానీ వాటిని నేను నిర్మించలేదు. ఆ సినిమాలు చేయడానికి అతడు అర్హుడు కాబట్టి అతడికి అవకాశం లభించింది. ఇక్కడ నిలదొక్కుకోగలిగితేనే అతనికి కెరీర్ ఉంటుంది. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే తన కెరీర్‌ను నేను నిర్మించలేను’ అంటూ హన్సాల్‌ మెహతా ట్వీట్‌ చేశారు. (నెపోటిజం: ఆ ఆవార్డును బైకాట్‌ చేశాను)

దీనిపై సోని రజ్దాన్‌ స్పందిస్తూ.. ‘ఫలానా వారి కొడుకు, కుమార్తె అంటే ప్రేక్షకులకు వారి మీద చాలా అంచానాలు ఉంటాయి. ఈ రోజు బంధుప్రీతి గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వీరు ఏదో ఒక రోజు తమ సొంత బిడ్డల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. తమ పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తామంటే.. ఏం చేస్తారు.. వారిని ఆపగల్గుతారా’ అని సోని రజ్దాన్‌ ప్రశ్నించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement