‘‘కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రజల్ని చైతన్యపరిచేలా ఓ పాట చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. గిటార్ వాయిస్తూ ట్యూన్ చేయడం మొదలుపెట్టాను. ఆ ట్యూన్‌ని ఫోన్‌లో రికార్డు చేసి రచయిత శ్రీనివాస్ మౌళికి పంపించాను. మేమిద్దరం కలిసి ఓ సినిమాకి పనిచేశాం. కానీ, ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆ చిత్రంలోని పాటలన్నీ తనే రాశాడు. ఆ లిరిక్స్, అందులోని పదాలు నాకు బాగా నచ్చాయి. అందుకే నా ట్యూన్‌ని ఆయనకి పంపించి, కరోనా నేపథ్యంలో ప్రజల్ని బాగా చైతన్యపరిచేలా మంచి లిరిక్స్ రాయాలని చెప్పా.. అలా ‘లైటజ్ ఫైట్ కరోనా’ పాట చేశాం’’ అని చెప్పారు సంగీతదర్శకుడు కోటి. ఇంకా ఈ పాట గురించి ఆయన మరిన్ని విశేషాలు చెప్పారు.
► నా ట్యూన్ విని శ్రీనివాస్ చరణం రాసి పంపించాడు. అప్పటికి ఇంగ్లిష్ పదాల్లేవు. ఈ పాట గురించి చర్చిద్దామని ఇంటికి రమ్మన్నాను. అప్పుడు ఇంగ్లిష్ పదాలు వచ్చాయి. ట్యూన్ కూడా చక్కగా కుదిరింది. నేను, మా అబ్బాయి రోషన్ కలిసి రికార్డ్ చేశాం. సమర్థ్ అనే కీ బోర్డ్ ప్లేయర్ కూడా నాకు రికార్డింగ్‌లో సహాయం చేశాడు.
► గిటార్‌తోనే ఈ పాటని కంపోజ్ చేశాను. చాలా బాగా వచ్చింది. కానీ, కొంచెం పెద్దగా ఉండటంతో నేను, రోషన్ కూర్చుని షార్ట్ చేశాం. గిటార్, వయొలిన్.. ఇలాంటి వాటితో మిక్స్ చేసి ఫైనల్ రికార్డింగ్ కోసం కృష్ణానగర్‌లోని ఓ రికార్డింగ్ స్టూడియోకి మెయిల్‌లో పంపించాను. అతను మొత్తం రికార్డింగ్ చేసి, క్లీన్‌గా అన్ని లెవల్స్ చూసుకుని తర్వాత నాకు పంపించాడు.
► ఈ పాటని ముందు నా స్నేహితులకు పంపించాను.. అందరూ చాలా బాగుందని అభినందించారు. అదే రోజు రాత్రి చిరంజీవిగారికి కూడా పంపించాను. ఉదయాన్నే ఆయన ఫోన్ చేసి, ‘పాట చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ పాటకి వీడియో చేద్దాం’ అన్నారు. ‘మీరు మెగాస్టార్.. మీరు వీడియో చేస్తే ఇంకేం కావాలి.. అందరికీ బాగా చేరువవుతుంది’ అన్నాను.
► చిరంజీవిగారే నాగార్జునగారికి ఫోన్ చేశారు. అలాగే ఆయనే వరుణ్ తేజ్, సాయిధరమ్‌తో పాడమని చెప్పారు. నిజానికి వెంకటేశ్‌గారు, మహేశ్‌బాబు, రామ్‌చరణ్.. ఇలా చాలామంది చేయాల్సింది. కానీ కుదరలేదు. అందుకే చిరంజీవిగారు, నాగార్జునగారు, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌లతో రికార్డ్ చేశాం. చిరంజీవిగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ పాట ఇంత పాపులర్ అయింది.
► ఈ వెర్షన్ రిలీజ్ చేయకముందే నేను గిటారుతో చేసిన పాటను రిలీజ్ చేశాను. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగువారందరూ అభినందించారు. ఆ తర్వాత ఈ నలుగురితో చేసిన వీడియో యూట్యూబ్, వాట్సాప్ ఇలా.. సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయింది.
► కమర్షియల్ సాంగ్స్ ఎన్నో చేశాను. కానీ మానవాళికి నా వంతు ప్రయత్నంగా ఈ పాట చేశాను. అందుకే చిరంజీవిగారు ‘మా వంతు సాయం చేయాలి కదా’ అన్నారు. ఆయన నాకు ఓ బ్రదర్‌లాగా అన్నమాట. మేము కలసి ఎన్నో సినిమాలు చేశాం.. అయితే అవి కమర్షియల్. కానీ, ఈ పాట ప్రజల కోసం. అందరి కోసం చేసిన ఈ పాటకి మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది.
► మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారు, కేసీఆర్‌గారు ప్రజల క్షేమం కోసం ఈ ‘లాక్‌డౌన్‌ని’ పక్కాగా అమలు చేస్తున్నారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
ప్రజల కోసం చేసిన పాట ఇది
Published Wed, Apr 1 2020 4:43 AM | Last Updated on Wed, Apr 1 2020 7:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment