‘‘మనిషి ఆనందంగా ఉంటేనే వినోదం వైపు దృష్టి మళ్లుతుంది. కరోనా గురించి ప్రజానీకం కంగారు పడుతున్న ఈ తరుణంలో వినోదాన్ని వాయిదా వేద్దాం. పరిస్థితులన్నీ కుదురుకున్నప్పుడే సినిమాల గురించి మాట్లాడుకుందాం. అప్పటివరకు అందరి క్షేమమే మా కాంక్ష’’ అన్నారు నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్. ఈ శార్వరి (తెలుగు కొత్త సంవత్సరం) నామ సంవత్సరం అన్ని విధాలా అందరికీ కలిసి రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం మానవాళి కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. ప్రపంచమంతా సంక్షోభంలో ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునే సంస్కృతి మనది. ఎవరికి వారై ఉంటూ, కలిసికట్టుగా కరోనా వైరస్‌ను పారదోలుదాం.
ఈ తెలుగు నూతన సంవత్సరంలో చీకటిని తరిమి కొత్త వెలుగును ఆహ్వానిద్దాం... ఆస్వాదిద్దాం. యావత్ ప్రపంచం ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలి’’ అన్నారు. ‘నేను..శైలజ.., ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల తర్వాత హీరో రామ్, దర్శకుడు ‘కిశోర్’ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘రెడ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్. ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతానికి థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఏప్రిల్‌లో పరిస్థితిని బట్టి ‘రెడ్’ విడుదల తేదీని నిర్ణయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment