
‘మామ్’... శ్రీదేవి!
కొంతమంది తారలు ఏళ్ల తరబడి నటించినా బోర్ కొట్టరు. జీవితాంతం వాళ్లు నటించినా, చూడాలనుకునే ప్రేక్షకులు ఉంటారు. ఆ స్థాయి అభిమానం సంపాదించుకున్న తారల్లో శ్రీదేవి ఒకరు. పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శ్రీదేవి దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ ఒప్పుకున్నప్పుడు ఆమె అభిమానులు సంబరపడిపోయారు. అన్నేళ్ల తర్వాత నటించినా శ్రీదేవి భేష్ అనిపించుకున్నారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ చేస్తే మంచి సినిమానే చేయాలనుకున్న శ్రీదేవి ‘బాంబే టాకీస్’లో అతిథి పాత్ర చేశారు. గత ఏడాది తమిళ చిత్రం ‘పులి’లో మహారాణిగా నటించిన విషయం తెలిసిందే.
తాజాగా ‘మామ్’ అనే హిందీ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రవి ఉడయవర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ఆరంభం కానుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ అతిథి పాత్ర చేయనున్నారు. ఇది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అనీ, శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తారనీ సమాచారం. సవతి తల్లి చుట్టూ తిరిగే ఈ చిత్ర కథలో కూతురి పాత్రకు కమల్‌హాసన్ రెండో కుమార్తె అక్షరా హాసన్‌ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.