ప్రేమా లేదు.. గీమా లేదు..!
ప్రేమా లేదు.. గీమా లేదు..!
Published Sun, Nov 3 2013 11:44 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM
‘‘ఇండియన్ ఐడల్గా నన్ను నిలబెట్టడానికి తెలుగువారు ఎంతో కృషి చేశారు. నన్ను గాయకునిగానే అంతగా ఆదరించిన ప్రజలు కథానాయకునిగా కూడా తప్పక ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా చేశాను’’ అని శ్రీరామచంద్ర అన్నారు. సుబ్బు ఆర్వీ దర్శకత్వంలో శ్రీరామచంద్ర, బార్బీ హండా జంటగా మద్దాల భాస్కర్(భాను) నిర్మించిన చిత్రం ‘ప్రేమా గీమా జాన్తానయ్’. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని బి.గోపాల్కి అందించారు. వారితో పాటు సుమన్, నరేష్, భానుచందర్, సాయికుమార్, శ్రీకాంత్ అడ్డాల, వీరు పోట్ల, జె.కె.భారవి, కె.ఎం.రాధాకృష్ణన్, సురేష్కొండేటి, ఐఏఎస్ అధికారి చక్రవర్తి అతిథులుగా పాల్గొని చిత్రం విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాకు ముందే నాకు హీరోగా చాలా అవకాశాలొచ్చాయి.
కానీ... మంచి అవకాశం కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాను. దర్శకుడు అద్భుతమైన కథను తయారు చేశారు. చాలా కష్టపడి ఈ పాత్ర చేశాను. కేవలం ఈ కేరక్టర్ కోసమే 15 కిలోలు బరువు తగ్గాను. నటన, నాట్యం, పోరాటాల విషయంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. రషెస్ చూసినవాళ్లందరూ నా పెర్ఫార్మెన్స్ బాగుందన్నారు. ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడానికే హీరోగా మారాను’’అన్నారు. ఆరు నుంచి అరవై ఏళ్ల వారి వరకూ అందరికీ నచ్చే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. పదికాలాల పాటు గుర్తుంచుకోదగ్గ సినిమాగా దర్శకుడు ఈ సినిమాను మలిచాడని నిర్మాత పేర్కొన్నారు.
Advertisement
Advertisement