
లైంగిక ఆరోపణలలో టాలీవుడ్, కోలీవుడ్‌లో కలకలం రేపిన నటి శ్రీరెడ్డి.
పెరంబూరు: లైంగిక ఆరోపణలలో టాలీవుడ్, కోలీవుడ్‌లో కలకలం రేపిన నటి శ్రీరెడ్డి. అవకాశం ఆశతో తనను వాడుకున్నారంటూ హైదరాబాదులో ఆందోళనకు దిగి రచ్చ చేసిన ఈ నటి ఆ తరువాత చెన్నైకి మకాం మార్చి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటుడు లారెన్స్ వంటి ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది. ఆ తరువాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న శ్రీరెడ్డి ఇటీవల వార్తల్లో నానుతోంది. లైంగిక వేధింపులంటూ విమర్శలు చేయడంతో పాటు తమకు అలాంటి సంఘటనలు ఎదురవ్వలేదంటూ స్టేట్‌మెంట్స్ ఇస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్ లాంటి ఇతర హీరోయిన్లపై దండెత్తడం వంటి చర్యలతో వివాదాంశంగా మారింది.
కాగా శనివారం సడన్‌గా నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్‌పై విమర్శలు దాడి చేయడం మొదలెట్టింది. తన ట్విట్టర్‌లో ఆయనను రకరకాలుగా విమర్శిస్తోంది. మరో వారంలో నడిగర్ సంఘం ఎన్నికలు జరగనున్న సమయంలో ఇటీవల నటి వరలక్ష్మి శరత్‌కుమార్, నటి రాధికా శరత్‌కుమార్ విశాల్‌పై మూకుమ్మడిగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కారణాలు చెప్పకుండా సంచలన నటి శ్రీరెడ్డి విశాల్‌పై విమర్శల దాడి చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.