సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లాగే చాలా మంది మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త దేవి అన్నారు. సినిమాలో చిన్న చిన్న పాత్రలు పొందేందుకు కూడా మహిళలు లైంగిక ఒత్తిడులకు గురి కావాల్సి రావడం దారుణమని మహిళా కార్యచరణ ఐక్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. నటి శ్రీరెడ్డి చేసిన కాస్టింగ్ కౌచ్ (అవకాశాల పేరిట వేధింపులు) ఆరోపణలపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను బుధవారం కలిసిన ఐక్యవేదిక ప్రతినిధులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా సినీ నటి అపూర్వ మీడియాతో మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) శ్రీరెడ్డిని బ్యాన్ చేయడం సరికాదన్నారు. ‘‘మా’ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న మమ్మల్ని అడగకుండానే ఆమెపై నిషేధం విధించారు. ఇంకా చెప్పాలంటే శ్రీరెడ్డిని ఈ విషయంపై సంప్రదించకుండా, ఆమె అభిప్రాయం తీసుకోకుండానే బ్యాన్ చేశారు. దీనికి నేను వ్యతిరేకం. అందుకే ’మా’ నుంచి బయటకొచ్చానని, ఇండస్ట్రీ పూర్తిగా మారాల్సి ఉందని’ అపూర్వ అభిప్రాయపడ్డారు.
శ‍్రీరెడ్డికి న్యాయం చేయాలంటూ మహిళా కార్యచరణ ఐక్య వేదిక సభ్యులు తలసానికి మెమోరాండంను అందించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు చాలా ఉన్నాయి. శ్రీరెడ్డి ఘటన తర్వాత అనేకమంది బాధితులతో మాట్లాడి తెలుసుకున్నాం. చిన్న చిన్న పాత్రలకు కూడా లైంగిక ఒత్తిడికి మహిళలు, యువతులు గురి కావాల్సి వస్తోంది. హెల్ఫ్‌లైన్, టోల్ ఫ్రీ నెంబర్ సినీ ఇండస్ట్రీకి ఉండాలి. అవుట్ డోర్‌కి వెళ్లినప్పుడు మహిళలకు బాత్రూమ్‌లు కూడా ఉండవని, అనేక అవమానాలు మహిళా ఆర్టిస్టులకు జరుగుతున్నాయని మెమోరాండంలో పేర్కొన్నారు.
సామాజిక కార్యకర్త దేవి ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి లాగ అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీలో క్యాష్ కమిటీ వెయ్యాలి. ఇండస్ట్రీలో స్త్రీల మీద అత్యాచారాలు, ఇతర రకాలుగా దోపిడీ జరుగుతుంది. సినిమా రంగంలో పనిచేస్తున్న వారి బాధలను తెలియపరిచేలా కమిటీని వేయాలి. సినీ ఇండస్ట్రీ మహిళల కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి. శ్రీరెడ్డిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. శ్రీరెడ్డి కేవలం ఆరోపణలు మాత్రమే చేయలేదన్నది గుర్తించాలి. ఆధారాలతో శ్రీరెడ్డి బయటపెడుతున్నఅందరిపై చర్యలు తీసుకొని అలాంటి వారిని ప్రజల ముందు నిలబెట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment