
సాక్షి, సినిమా : హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌కు నటి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పారు. తన క్షమాపణకు రకుల్ అర్హురాలని ఆమె తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు వేధింపులు ఎదురు కాలేదని గతంలో రకుల్ తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు తన చర్యలకు శ్రీ రెడ్డి క్షమాపణ చెప్పారు.
పవన్ అభిమానులకు కృతజ్ఞతలు
శ్రీరెడ్డి పవన్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ‘మానవత్వం బతికే ఉంది. కుటుంబానికి దూరమై ఏకాకి అయిన నాకు కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు తిన్నావా అక్క, బాగున్నావా అని మెసెజ్‌లు చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. థాంక్స్ పవన్ కళ్యాణ్ ఫాన్స్’ అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి ఏర్పాటుకి రంగం సిద్ధం అవుతుంది. వీరికి జనసేన వీరమహిళా విభాగం అండగా ఉంటుంద’ని పవన్ చేసిన ట్వీట్‌కి శ్రీరెడ్డి అభినందనలు తెలిపారు. ‘పవన్ కళ్యాణ్ గారు మీడియాని బహిష్కరించే దమ్ము ఎవరికీ లేదు. ఇది మీరు గుర్తించాలి. త్వరలో ఎన్నికలు కూడా వస్తున్నాయి. మీడియా వాళ్ళతో ఎందుకు సార్ గొడవలు పెట్టుకుంటారు’ అని మరో పోస్టులో శ్రీ రెడ్డి పేర్కొన్నారు.