
సాక్షి, తిరుమల: దివంగత సినీనటి శ్రీదేవికి తిరుమల శ్రీవారంటే ఎనలేని భక్తి. తరచూ స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది. తిరుపతిలోని బంధువుల ఇళ్లకు వచ్చిన ప్రతిసారీ తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేవారు. చిత్ర సీమలో అగ్రనటిగా స్థిరపడిన తరువాత కూడా ఆమె శ్రీవారిని మరువలేదు. గులాబి చిత్రం ఫేమ్ మహేశ్వరి కుటుంబ రీత్యా శ్రీదేవికి చెల్లెలు అవుతారు. మహేశ్వరి వివాహం సెప్టెంబర్ 17, 2008లో తిరుమలలో జరిగింది.
ఈ వివాహ కార్యక్రమానికి శ్రీదేవి, భర్త బోనికపూర్, ఇద్దరు కుమార్తెలతో కలసి హాజరయ్యారు. సెప్టెంబర్ 10, 2011లో భర్తతో కలసి సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 6, 2012, టీటీడీ ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ టీ సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డి, ఇతర స్నేహితులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. మే 1వ తేదీ 2015లో అభిషేక సేవ, జూన్ 25, 2017లో భర్త బోనీ కపూర్, ఇద్దరు కుమార్తెలతోపాటు మరిది అనిల్‌కపూర్, ఇతర కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు.