గత శనివారం రాత్రి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మరణించిన శ్రీదేవి భౌతికకాయం మూడురోజుల తరువాత మంగళవారం ముంబై నగరానికి చేరుకుంది. ఎన్నో అనుమానాలు, అపోహల తరువాత దుబాయ్ ప్రాసిక్యూషన్ శ్రీదేవిది ప్రమాదవశాత్తు సంభవించిన మరణమేనని తేల్చింది. దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకున్న శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె స్వగృహానికి తీసుకెళ్లారు.
ఈ రోజు ఉదయం 9.30 సమయంలో అభిమానుల సందర్శనార్థం ఆమె ఇంటికి సమీపంలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క‍్లబ్‌లో ఉంచారు. మధ్యాహ‍్నం 12.30 వరకు అభిమానులను అనుమతించనున్నారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే ముంబై చేరుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరో వెంకటేష్‌లతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు ఇప్పటికే ముంబై చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. 3.30 గంటల సమయంలో విలేపార్లే హిందూ స్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment