హరిద్వార్‌లో శ్రీదేవీ అస్థికల నిమజ్జన కార్యక్రమం
న్యూఢిల్లీ : కోట్లాది అభిమానులను కన్నీటిలో ముంచి, ఈ లోకం విడిచి వెళ్లిన శ్రీదేవీ అస్థికల నిమజ్జన కార్యక్రమాన్ని హరిద్వార్‌లో కూడా నిర్వహించారు. గత వారం రామేశ్వరంలో ఆమె అస్థికలు కలిపిన తర్వాత, నిన్న(గురువారం) హరిద్వార్ వద్ద కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. హరిద్వార్ షూటింగ్ సమయంలో 1993లో ఆమె మళ్లీ అక్కడికి వస్తానని మొక్కుకున్నారని, ఈ క్రమంలో శ్రీదేవీ కోరిక నెరవేర్చడానికి రెండోసారి కూడా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. హరిద్వార్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బోనీ కపూర్‌తో పాటు, ఆయన సోదరుడు అనిల్ కపూర్, శ్రీదేవీ క్లోజ్ ఫ్రెండ్, డిజైనర్ మనీష్ మల్హోత్రాలు పాల్గొన్నారు.
కపూర్ కుటుంబానికి చెందిన పూజారులు శివ్ కుమార్ పాలివాల్, మనీష్ జైస్వాల్‌లు హరిద్వార్‌లోని వీవీఐపీ ఘాట్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి కంఖల్‌లో ఉన్న హరిహర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఉత్తరఖాండ్ వ్యవసాయ మంత్రి సుబోద్ యూనియల్, హరిద్వార్ మేయర్ మనోజ్ గార్గ్, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్‌లు కూడా ఈ పూజ కార్యక్రమానికి విచ్చేశారు. రామేశ్వరంలో జరిగిన కార్యక్రమానికి బోని కపూర్, తన కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లతో కలిసి వెళ్లారు.
మరణించిన వారి అస్థికలు నదుల్లో కలపడం హిందూ సంప్రదాయంలో భాగంగా వస్తున్న సంగతి తెలిసిందే. నదీతీర్థాల్లో కర్మకాండలు ఆచరించిన అనంతరం పవిత్ర నదుల్లో అస్థికలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. మేనల్లుడి వివాహానికి హాజరైన శ్రీదేవీ, దుబాయ్ హోటల్‌లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవీ మరణం కోట్లాది మంది అభిమానులను తీవ్ర దుఃఖసాగరంలో ముంచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment