సాక్షి, ముంబయి : తన అభిమాన నటి శ్రీదేవి కోసం ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి కలం పట్టారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. దానికి శ్రీదేవి అభిమానులకు ప్రేమలేఖ అంటూ టైటిల్ పెట్టారు. ఆ లేఖలో ఆయన శ్రీదేవి జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు, ఎన్నో జ్ఞాపకాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవాలు, తన భావోద్వేగాలు పంచుకున్నారు. శ్రీదేవి హఠాన్మరణం చెందినప్పటి నుంచి దాదాపు రామ్‌గోపాల్ వర్మ తీవ్ర విచారంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవి అంటే పడిచచ్చేంత అభిమానంతోపాటు తన గుండెలనిండా ఆమెపై ప్రేమే ఎప్పటికీ ఉంటుందంటూ వెల్లడించిన ఆయన రెండో లేఖను ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేశారు. ఇలాంటి లేఖలు ఇకముందు కూడా రాస్తూ ఉండొచ్చేమోగానీ, తన కన్నీటిని మాత్రం ఎప్పటికీ ఆపుకోలేనంటూ ఆయన లేఖను ముగించారు.
తాజాగా తానొక ఫ్యాన్‌గా శ్రీదేవి ఫ్యాన్స్‌కు పలు విషయాలు వెల్లడించారు. మొత్తంగా పైకి కనిపించేంత అందమైన లోకం శ్రీదేవిది కాదని, ఆమె గుండెలో ఎన్నోభయాలు, బాధలు పొదివిపట్టుకున్నారని, తండ్రి ఉన్నంత వరకు ఆకాశంలో పక్షిలా స్వేచ్ఛగా ఎగిరిన ఆమె తండ్రి చనిపోయిన తర్వాత తల్లి అతిగా చేసిన చర్యల కారణంగా ఆమె పంజరంలో పక్షిలా మారిపోయారన్నారు. అందరూ పైకి చూస్తున్నంత సంతోషంగా శ్రీదేవి లేరని చెప్పారు. 'అందమైన ముఖారవిందం. గొప్ప టాలెంట్. ఇద్దరు అందమైన కూతుళ్లతో కుదురుగా ఉన్న సంసారం.. ఇవన్నీ బయట నుంచి చూస్తున్నవారికి ఆమె కోరుకున్నట్లుగానే జీవితం ఉందని అనిపించవొచ్చు.. కానీ, నిజానికి శ్రీదేవి సంతోషంగా ఉంటూ సంతోషకరమైన జీవితం గడుపుతుందా ? నేను తొలిసారి కలిసినప్పటి నుంచి శ్రీదేవి జీవితం నాకు తెలుసు. చాలా దగ్గరిగా ఆమెను చూశాను. తన తండ్రి ఉన్నంతకాలం పక్షిలా హాయిగా ఎగరడాన్ని నా కళ్లతో చూశాను.
కానీ, ఆమె తండ్రి మరణం, తల్లికి అనారోగ్యం, ఆర్థికసమస్యలు ఆమె సంతోషంగా లేదని చెప్పేందుకు కొన్ని అంశాలు అన్నారు. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం సమయంలో తప్ప ఆమెకు ఎప్పుడూ నచ్చిన జీవితం లేదని, చాలా ఎక్కువ అసంతృప్తితో ఉన్న మహిళ శ్రీదేవి అన్నారు. ఆమె జీవితం ఊహించని విధంగా మలుపులు తిరిగిందని, ఆమకు ప్రైవేట్ లైఫ్ గాఢందకారంలోకి పోయినట్లుగా మారిందని, దాంతో సున్నితమైన మనస్సుగల ఆమెకు మనశ్శాంతి అనేది లేకుండా పోయిందన్నారు. శ్రీదేవి మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యారా అనే విషయంపై కూడా వివరణ ఇస్తూ ఆమె చాలా చిన్నవయసులోనే కెమెరా ముందుకు వెళ్లిందని దాంతో ఆమె సహజంగా ఎదగడానికి కావాల్సిన స్పేస్ దొరకకుండా పోయిందన్నారు.
బయటి జీవితంతో బిజీ అయిన ఆమె అనూహ్యంగా తన జీవితంలోకి తొంగిచూసుకోవడం ప్రారంభించారని చెప్పారు. ప్లాస్టిక్ సర్జరీలను కూడా పేర్కొంటూ వయసు అనేది ప్రతి నటికి ఓ పీడకల అని, దీనిని కాపాడుకునే విషయంలో శ్రీదేవి మినహాయింపేమికాదన్నారు. సందర్భానుసారంగా ఆమె కాస్మోటిక్ సర్జరీలు చేయించుకునేవారని తెలిపారు. నిత్యం ఆమె తల్లిదండ్రుల సూచనలు, బంధువులు, భర్త సూచనల మేరకే నడుచుకునే వారని చివరకు పిల్లల విషయంలో కూడా కొంత ఒత్తిడికి గురయ్యేవారని తెలిపారు. మొత్తానికి శ్రీదేవి మానసిక పరిస్థితి నిత్యం ఉన్నతశ్రేణి గందరగోళాలతో నిండుకుంటూ ఉండేదని వర్మ చెప్పారు.
'శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ'
Published Tue, Feb 27 2018 5:24 PM | Last Updated on Tue, Feb 27 2018 5:33 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment