రియల్‌ స్టార్‌ టైటిల్‌ మా ఇద్దరిదీ! | Srihari Son Meghamsh Special Interview on Rajdoot Movie | Sakshi
Sakshi News home page

రియల్‌ స్టార్‌ టైటిల్‌ మా ఇద్దరిదీ!

Published Wed, Jul 10 2019 10:42 AM | Last Updated on Wed, Jul 10 2019 10:42 AM

Srihari Son Meghamsh Special Interview on Rajdoot Movie - Sakshi

మేఘాంశ్‌

‘‘ప్రసుత్తం బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నాను. స్టూడెంట్‌గా ఓ 70 శాతం మార్కులు వస్తాయి. చిన్నప్పట్నించి సినిమాల్లోకి రావాలనే ఐడియాతోనే  పెరిగాను. అందుకే సినిమా తప్ప నాకు ఏమీ తెలియదు. మా నాన్న కూడా ‘మా చిన్నోడు హీరో అవుతాడు, పెద్దోడు డైరెక్టర్‌ అవుతాడు’ అని చెప్పేవారు. అది అలాగే నా మైండ్‌లో పడిపోయింది’’ అన్నారు మేఘాంశ్‌. దివంగత నటుడు, రియల్‌ స్టార్‌ శ్రీహరి రెండో కుమారుడు మేఘాంశ్‌. అర్జున్‌–కార్తీక్‌ల దర్శకత్వంలో సత్యనారాయణ నిర్మించిన ‘రాజ్‌దూత్‌’ చిత్రం ద్వారా మేఘాంశ్‌ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ శుక్రవారం విడుదల సందర్భంగా మేఘాంశ్‌ చెప్పిన విశేషాలు.

శ్రీహరి గారి  రియల్‌ స్టార్‌ టైటిల్‌ మీ ఇద్దరిలో ఎవరు తీసుకుంటారు? అని కొంతమంది అడిగారు. ఆ టైటిల్‌  నా ఒక్కడిదే కాదు, నాది, మా అన్నయ్య శశాంక్‌ ది. నాది అమ్మ పోలిక, కానీ నాన్న యంగ్‌గా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు నేను అలానే ఉన్నాను అంటున్నారు. అన్నయ్య ఇంకా ట్రైన్‌ అవుతున్నాడు. మరో నాలుగైదేళ్లల్లో దర్శకుడు అవుతాడు. మా అమ్మ, అన్న ఎప్పుడూ గైడ్‌ చేస్తారు నన్ను. ఫ్యూచర్‌లో నాతో, అన్నతో సి.కళ్యాణ్‌ మామ సినిమా చేస్తాను అన్నారు.

నాన్న మరణం తర్వాత అనుకోకుండా ఇండస్ట్రీకి అలా దూరమైపోయాం. ఈ గ్యాప్‌లో మేం పర్సనల్‌గా ఫుల్‌ స్ట్రగుల్‌ అయ్యాం. అమ్మని మేం చూసుకోవటం, ఆమె మమ్మల్ని చూసుకోవటం జరిగింది. సడెన్‌గా ఇలా హీరోలా ఎంట్రీ ఇస్తే అందరూ నిండు మనసుతో ఆదరించారు. సినీ పరిశ్రమ మొత్తం వెల్‌కమ్‌ చేస్తూ ఎంతో ప్రేమతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది.

ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. 44 డిగ్రీస్‌ ఎండల్లో హైదరాబాద్, రాజమండ్రి, రంపచోడవరంలలో షూటింగ్‌ జరిపాం. మంచి అవుట్‌ పుట్‌ వచ్చింది. ఇది హారర్‌ జానర్‌ అని, ఇలా ఒక జానర్‌ అని అనుకోలేం. రెండు, మూడు జానర్లు కలిసిన కథ.

ఇలాంటి ఓ సినిమా ఉందని టీజర్‌ లాంచ్‌ వరకు ఎవరికీ తెలియక పోవటానికి కారణం మొదట్లో చాలా ప్రెజర్‌ ఉండేది. మా అమ్మ షూటింగ్‌కి వస్తేనే నాకు చాలా ఒత్తిడిగా ఉండేది. ఇక అందరికీ చెప్పి చేస్తే ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే ఎవరికీ చెప్పకుండా షూటింగ్‌ అంతా కంప్లీట్‌ చేసి టీజర్‌తో మీ ముందుకు వచ్చాను. కొంచెం సినిమా రోడ్‌ జర్నీతో ముడిపడి ఉంటుంది. ఈ సినిమాకి ‘రాజ్ దూత్ ’ టైటిల్‌ ఫుల్‌ యాప్ట్‌. ఇది కమర్షియల్‌ సినిమానే కానీ, కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నా ఫేస్‌కి, నా ఏజ్‌కి ఇది కరెక్ట్‌ సినిమా అనిపించింది.

మొన్న అమ్మకు సినిమా చూపించాను. మొదట్లో అమ్మ కొంచెం నెర్వస్‌గా ఉండేది. సినిమా అవుట్‌పుట్‌ ఎలా వస్తుందో అని. సినిమా చూశాక ఆమె ప్రౌడ్‌గా ఫీలయ్యింది. ‘ఏందిరా ఇంత తెల్లగా ఉన్నావు’ అంది. ఇంట్లో మేం డాన్స్‌ వేసినప్పుడల్లా అమ్మ గైడ్‌ చేసేది. అంత పెద్ద డాన్సర్‌ మా ఇంట్లోనే ఉందిగా మరి.

నాన్న ఉన్నప్పుడు అందరినీ బాగా చూడు, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, అందరూ సమానమే అని చెప్పేవారు. అందరికీ హెల్ప్‌ చేయాలనేవారు. నాన్న ఉండి ఉంటే ఇంకా బెటర్‌ లాంచ్‌ డెఫినెట్‌గా ఉండేది.

ఈ సినిమా స్టార్ట్‌ అవక ముందు ఓ నెలరోజుల పాటు నటనలో బేసిక్‌ ట్రైనింగ్‌ తీసుకొన్నాను. స్కూల్లోనే థియేటర్‌ యాక్టింగ్‌ మీద అవగాహన ఉంది. మా సినిమాలోని బైక్‌ వాయిస్‌ టీజర్‌కి మాత్రమే ఉంటుంది. సునీల్‌గారు వాయిన్‌ ఓవర్‌ చెప్పారు. సినిమాలో బైక్‌కి వాయిస్‌ ఉండదు.

మా సినిమాకి ఇద్దరు దర్శకులు. అర్జున్‌ అండ్‌ కార్తీక్‌. వాళ్లు దర్శకుడు సుధీర్‌ వర్మ దగ్గర రైటర్స్‌గా ఉండేవాళ్లు. నాకు సినిమా స్టార్టింగ్‌ నుంచి ఓ డౌట్‌ ఉండేది. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే సినిమా ఆగిపోతుందేమో అనుకొనేవాణ్ని. ఇద్దరూ మంచి కో– ఆర్డినేషన్‌తో ఒకే మాట మీద ఫుల్‌ క్లారిటీతో ఉంటారు. నిర్మాత సత్యనారాయణ గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement