వివాదంపై స్పందించిన రాజమౌళి
చెన్నై: కన్నడిగులపై తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్ణాటకలో బాహుబలి-2 సినిమాను అడ్డుకుంటామని ప్రకటించడంపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ఈ వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం సమంజసం కాదని 'ఇండియాటుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
'దాదాపు ఐదేళ్లుగా సత్యరాజ్ తో కలిసి పనిచేస్తున్నా. ఇతరులను బాధ పెట్టేవిధంగా ఆయన నడుచుకోవడం నేనింతవరకు చూడలేదు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన వీడియోల గురించి విచారించాం. అవి తొమ్మిదేళ్ల క్రితం నాటివని తెలిసింది. దీని తర్వాత ఆయన నటించిన 30 సినిమాలు కర్ణాటకలో విడుదలయ్యాయి. బాహుబలి: ది బిగినింగ్ కూడా అందులో ఒకటి. అప్పుడు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ సమయంలో వివాదం చేయడం కరెక్ట్ కాద'ని రాజమౌళి అన్నారు.
దగ్గుబాటి రానా మాట్లాడుతూ... 'సత్యరాజ్ 10 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలవి. బాహుబలి మొదటి భాగం కర్ణాటకలో కూడా విడుదలై అందరి అభిమానాన్ని సంపాదించింది. ఘన విజయాన్ని అందుకుంది. వివాదాన్ని మళ్లీ తెరపైకి ప్రచారం పొందాలని కొందరు భావిస్తున్నార'ని అన్నారు. కావేరి నదీ జలాల వివాదం నేపథ్యంలో కన్నడిగులపై సత్యరాజ్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణ చెప్పేవరకు బాహుబలి-2 సినిమాను విడుదలకానీయబోమని వటల్ నాగరాజ్ అనే కార్యకర్త హెచ్చరించారు.