మనసు ఉరకలేస్తోంది
నిత్యం తమ కార్యకలాపాలతో బిజీగా ఉండే వారికి ఒక్కసారిగా పని లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే సాధ్యం కాదు. జీవితమే శూన్యంగా కనిపిస్తుంది. అలాంటిది సినిమానే జీవితంగా గడిపే విశ్వనటుడు కమలహాసన్ సుమారు నెలకు పైగా ఖాళీగా అదీ ఇంట్లోనే గడపాలంటే అంతకంటే నరకం మరొకటి ఉండదు. అయినా నిత్యం సినిమా గురించే ఆలోచించే కమలహాసన్ ఖాళీగా ఎందుకు కూర్చుంటారు చెప్పండి.
శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను అమెరికాలో పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగొచ్చిన కమల్ తన కార్యాలయం మిద్దె పైనుంచి దిగుతూ కాలు జారి మెట్లపైనుంచి కింద పడి గాయాలకు గురైన సంగతి, ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం కాస్త విశ్రాంతి పొందుతున్న విషయం విదితమే. అయినా పరామర్శించడానికి వచ్చిపోయే ప్రముఖలతో కాలం గడుపుతున్న కమల్ మరో పక్క తన సినిమాకు సంబంధించిన కార్యక్రమాలుకు సిద్ధం అయ్యారట. పనికి మనసు ఉరకలేస్తోంది. అందుకు నేను సిద్ధం అయ్యాను.
ఈ నెలలోనే తదుపరి షెడ్యూల్ మొదలు కానుంది. కాలు జారి పడడాన్ని సాధారణ విషయంగా భావించడం లేదు.దానికి సంబంధించి చిన్న కథ చెప్పాలి. ఈ విషయాన్ని మీతో తరువాత పంచుకుంటాను. ముందుగా వైద్యసేవలందించిన వైద్యులకు, అభిమానించేవారికి, బిజీగా ఉన్న వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.అంటూ కమలహాసన్ ఇటీవల తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయనకు జరిగిన విపత్తు కారణంగా శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్, విడుదల తేదీలన్నీ మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చిత్రంలో నటిస్తున్న బ్రహ్మానందం, శ్రుతిహసన్, రమ్యకృష్ణ తదితరులు కాల్‌షీట్స్ గురించి చర్చలు జరుగుతున్నట్లు కమల్ వర్గం తెలిపింది.