
కొమరం భీమ్‌నే ఇంటికి తీసుకెళ్తున్నంత సంబరంగా ఉంది
‘‘గిరిజన పోరాట యోధుడు, ఆదివాసీల ఆరాధ్యదైవం కొమరం భీమ్. ఆ మహనీయుని పేరిట స్థాపించిన జాతీయ పురస్కారాన్ని నాకందించడం గర్వంగా ఉంది. కొమరం భీమ్‌నే నా ఇంటికి తీసుకెళ్తున్నంత సంబరంగా ఉంది’’ అని రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. భారత్ కల్చరల్ అకాడమీ, కొమరం భీమ్ స్మారక పరిషత్, ఆదివాసి సంస్కృతి పరిరక్షణ సమితి, ఓం సాయితేజ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కొమరం భీమ్ జాతీయ అవార్డు’ని ఈ ఏడాది సుద్దాల అశోక్‌తేజకు అందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో 50 వేల 101 రూపాయల నగదు, దుశ్శాలువా, జ్ఞాపికతో సుద్దాలను సన్మానించారు.
ఈ సందర్భంగా సుద్దాల స్పందిస్తూ -‘‘సినిమా రంగంలో ఇప్పటివరకూ 30 అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులన్నీ ఓ ఎత్తు... ఈ పురస్కారం ఓ ఎత్తు. దాసరి నారాయణరావు, కేవీ రమణాచారిగార్ల ప్రోత్సాహం వల్లే సినీ పరిశ్రమలో రచయితగా ఈ స్థాయికి రాగలిగాను. దాసరి గారి ‘పరమవీర చక్ర’ సినిమాకోసం కొమరంభీమ్‌పై పాట రాసే అదృష్టం కూడా నాకు కలిగింది. ఆనాటి కృషి ఈ విధంగా ఫలించిందనుకుంటున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ మనవడు కొమరం సోనేరావు, పరుచూరి గోపాలకృష్ణ, బాబూమోహన్, రమణాచారి, సముద్రాల వేణుగోపాలాచారి, వెనిగళ్ల రాంబాబు, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.