‘‘ఒకప్పుడు సౌత్ ఫిల్మ్స్.. నార్త్ ఫిల్మ్స్ అని ఒక వ్యత్యాసం ఉండేది. కానీ ఈ రోజు నార్త్.. సౌత్ అనేది లేదు. మొత్తం ఇండియన్ ఫిల్మే అయ్యింది. అంటే ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. అక్కడివాళ్లు ఇక్కడ, ఇక్కడివాళ్లు అక్కడ చేస్తున్నారు. ఇది శుభపరిణామం. తెలుగు సినిమాల డబ్బింగ్ రైట్స్‌కి మంచి క్రేజ్ ఉంది. ఇలా అన్ని రాష్ట్రాల మధ్య సంబంధాలు ఒకేలా కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఎస్. కృష్ణ దర్శకత్వంలో సుదీప్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘పహిల్వాన్’.
ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటించారు. స్వప్న కృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘జీవితంలో మనం అందరం మన కోసం సాధించుకుంటాం. కానీ దేశం కోసం సాధించిన సింధుగారిని అభినందించాలి. ఈ మధ్య భారతదేశం సాధించిన ఒక గొప్ప విజయం, విషయం ఏంటంటే చంద్రయాన్.
‘చంద్రయాన్’ అనే రాకెట్‌ని క్షక్ష్యలోకి ప్రవేశపెట్టి దేశం మొత్తం మనవైపు చూసేలా చేశారు. బ్యాడ్మింటన్ రాకెట్‌తో దేశం మొత్తం మనవైపు చూసేలా చేశారు సింధుగారు. ఇక కన్నడ ప్రజలు, తెలుగు ప్రజలు కవల పిల్లలులాంటివారు. తెలుగు పరిశ్రమకు కన్నడ రాష్ట్రం ఎంత సపోర్ట్ చేస్తుందో మాకు తెలుసు. తెలుగు సినిమాను కూడా కన్నడ సినిమాలానే ఫీల్ అవుతారు. మనవాళ్లు కూడా ఒక మంచి కన్నడ చిత్రం వచ్చిందంటే తెలుగు సినిమా కన్నా ఎక్కువగా నెత్తిన పెట్టుకుని చూస్తారు. దానికి ఉదాహరణ ‘కేజీఎఫ్’.
అలాగే ఈ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. సుదీప్ ఏ భాషలో నటించినా అక్కడి ప్రజల మనసును పరిపూర్ణంగా చూరగొనే ఆర్టిస్ట్. సుదీప్ ఆల్రెడీ సర్టిఫైడ్ హీరో. కానీ ఆయన ఆ బౌండరీలో లేడు. ఏ రాష్ట్రం వారు పిలిచినా ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందంటే ఆ రాష్ట్రానికి వెళతాడు. నటిస్తాడు. ఆ క్యారెక్టర్‌కు న్యాయం చేసి వస్తాడు. ఈ సినిమా కోసం సుదీప్ బాడీ షేపప్ చేశాడు.. చాలా తగ్గాడు. అఫ్‌కోర్స్... మన ఇండియన్ హీరోలంతా అంతే.
మన తెలుగు వాళ్లలో ఉదాహరణకు... ప్రభాస్, మహేశ్, చరణ్, తారక్.. ఇలా అందరూ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా తగ్గుతారు. ఇప్పుడు బాలకృష్ణ 11 కేజీలు తగ్గారు. ‘సరైనోడు’ కోసం బన్నీ, ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్.. ఇలా ఎవరికి వారు డైరెక్టర్‌ని బాడీ ఎలా కావాలి? ఒక కథకు ఏం కావాలి? అని అడిగి తమను తాము మౌల్డ్ చేసుకుంటున్నారు. ఈ కోవలో సుదీప్ కూడా ఉన్నారు. సాయి కొర్రపాటిగారు మంచి మూవీ లవర్. మన సినిమాలను ఇతర భాషల్లో, ఇతర భాషల్లోని సినిమాలను మనకు చూపించాలని తాపత్రయపడుతుంటారు.
అందుకు ఓ ఉదహరణ ఈ ‘పహిల్వాన్’ సినిమా. ఇంతకుముందు ఆయన తెలుగులో విడుదల చేసిన ‘కేజీఎఫ్’ చిత్రానికి మంచి రెవెన్యూ వచ్చింది. ‘పహిల్వాన్’ కూడా అంత మంచి సినిమా అవ్వాలి. దర్శకుడు కృష్ణగారు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. సింధు గోల్డ్ మెడల్ కొట్టినట్లే ఈ సినిమా కూడా అంతటి స్థాయిలోకి వెళ్లాలి’’ అన్నారు. ‘‘ఇలాంటి సినిమాలు చాలామందికి స్ఫూర్తిని ఇస్తాయి. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. ట్రైలర్ చూశాను. సుదీప్‌గారు చాలా కష్టపడ్డారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం.
మనపై నమ్మకం ఉంచి ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. కష్టపడితేనే పైకి రాగలం. ముందు ముందు దేశానికి ఇంకా మంచి పేరు తీసుకురావడానికి కష్టపడతాను. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వేదికపై ఉండటం హ్యాపీ. ‘పహిల్వాన్’ సినిమా చూడండి’’ అన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ‘‘ఈ వేదికపై సింధుగారు ఉండటం మాకు చాలా గౌరవంగా ఉంది. సింధుని ఇండియాకి ఇచ్చిన ఆమె తల్లిదండ్రులకు థ్యాంక్స్. వేదికలపై నేను అంతగా మాట్లాడలేను. నెక్ట్స్ టైమ్ ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతాను.
గ్రామర్ తప్పులు లేకుండా మాట్లాడతాను. తెలుగు ప్రేక్షకులు నాకు చాలా గౌరవాన్ని, ప్రేమను అందిస్తున్నారు. నా జీవితంలో ‘ఈగ’ చిత్రాన్ని, రాజమౌళిగారిని, తెలుగు ప్రేక్షకులను మర్చిపోలేను. నిర్మాత సాయిగారు నాకు వెరీ స్పెషల్. మంచి మానవతావాది ఆయన. నన్ను అభినందించిన బోయపాటిగారికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం దర్శకుడు కృష్ణ నిర్మాతగా మారారు. చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి తగిన ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను. భవిష్యత్‌లో సింధు మేడమ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుదీప్.
‘‘పహిల్వాన్’ సినిమాతో హైదరాబాద్‌కు స్పెషల్ కనెక్షన్ ఉంది. సినిమా చిత్రీకరణ ఇక్కడే మొదలైంది. మేజర్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరిగింది. ఈ సినిమాను తెలుగులో ఈ స్థాయిలో విడుదల చేస్తున్న సాయిగారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు కృష్ణ. ‘‘ఈ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అన్నారు’’ చాముండేశ్వరీనాథ్. ‘‘తెలుగు రాష్ట్రాల్లో సుదీప్‌గారికి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన నటించిన ప్రతి తెలుగు చిత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్. ‘పహిల్వాన్’ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. బ్రహ్మాండమైన ఆల్బమ్ కుదరింది. ఈ చిత్రం ద్వారా అర్జున్ జన్యలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు పరిచయం కావడం నా అదృష్టం’’ అన్నారు రామజోగయ్య శాస్త్ర్రి. ‘‘ఈ సినిమాలో రుక్మిణి పాత్ర చేశాను. నాది రొటీన్ హీరోయిన్ పాత్ర కాదు’’ అన్నారు ఆకాంక్షా సింగ్. కబీర్ దుహాన్ సింగ్, కార్తీక్, రామారావు, సాయి కొర్రపాటి తదితరులు పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment