
రామ్ చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన రంగస్థలం ఈ శుక్రవారం రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 1980ల నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ చిట్టిబాబు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా దర్శకుడు సుకుమార్.. పాత్రికేయులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈసందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు సుకుమార్.
రంగస్థలం సినిమాకు సీక్వెల్ ఉంటుందా లేదా అన్న విషయం ఇప్పుడు చెప్పలేనన్న సుక్కు.. ఒక వేళ చేస్తే మాత్రం ఆ సినిమాలో చిట్టిబాబు చెవికి ఆపరేషన్ అయి అన్ని మంచిగా వినిపిస్తున్నట్టుగా చూపిస్తానని తెలిపారు. కేవలం పాత్రలను మాత్రమే తీసుకొని కొత్త కథతో సినిమాను తెరకెక్కిస్తానని తెలిపారు. చిరంజీవితో సినిమా చేయటం తన కల, నేను రాసిన కథ చిరుకు నచ్చితే నా కల నెరవేరినట్టే అన్నారు. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయలు ఇతర కీలకపాత్రల్లో నటించారు.