అది మా కుటుంబంలోనే లేదు!
‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సుమంత్ ‘నరుడా.. డోనరుడా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హిందీ ‘విక్కీ డోనర్’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని మల్లిక్‌రామ్ దర్శకత్వంలో వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మించారు. పల్లవీ సుభాష్ కథానాయిక.
ఈ శుక్రవారం విడుదల కానున్న ‘నరుడా.. డోనరుడా’ గురించి సుమంత్ మాట్లాడుతూ- ‘‘ ‘గోల్కొండ హైస్కూల్’ తర్వాత నా మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు. దాంతో కెరీర్‌జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనుకున్నా. ఓ రోజు టీవీలో ‘విక్కీ డోనర్’ చూసిన తాతయ్య (ఏయన్నార్) చాలా బాగుందన్నారు. అటువంటి వైవిధ్యమైన కథలు రాయమని రచయితలకు చెప్పేవాణ్ణి. నిర్మాత రామ్మోహన్‌గారు దర్శకుడు మల్లిక్‌ను పరిచయం చేశారు. మల్లిక్ విజన్ ఉన్న డెరైక్టర్. వీర్యదానం నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదంతో పాటు సందేశం ఉంటుంది. సినిమాలో ఎక్కడా అసభ్యత ఉండదు.
రెగ్యులర్ చిత్రాలు చేయడం మా కుటుంబంలోనే లేదు. ఎప్పుడూ కొత్తవి ట్రై చేస్తుంటాం. రావణాసురుడు, దుర్యోధనుడి తరహా విలన్ పాత్రలు చేయాలనుంది. ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్‌బాబుగార్లు తొలుత విలన్‌గా నటించి, సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఈ చిత్రం విడుదల తర్వాత పూర్తి వివరాలు చెబుతా’’ అన్నారు.