భీమవరంలో సందడి చేసిన హీరో సునీల్, ‘భీమవరం బుల్లోడు’ ఆడియో విడుదల
భీమవరం, న్యూస్‌లైన్ : ‘భీమవరాన్ని ఆంధ్రా అమెరికాగా పిలుస్తుంటాను.. ఎందుకంటే వేర్‌ఆర్‌యూ అని అక్కడ పిలుస్తారు.. ఇక్కడ హే... ఎక్కడికి వెళ్తున్నావ్.. అని ఆప్యాయతగా పలకరిస్తారు. అందుకే నేనలా ఉచ్చరిస్తాను’ అని హీరో సునీల్ అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి సునీల్ హీరోగా నటించిన ‘భీమవరం బుల్లోడు’ ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో డీఎన్నార్ క్రీడా మైదానంలో ఆటలు ఆడుకున్నాని గుర్తుచేశారు.
మొదటగా ఎన్‌టీ రామారావు వచ్చినప్పుడు తరువాత వర్షం సినిమా ఆడియో విడుదల సందర్భంగా ఈ ప్రాంగణంలో భారీగా జనం వచ్చారని.. మరలా ఇప్పుడు అంతటి జనాన్ని చూస్తున్నానని చెప్పారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి డీఎన్నార్ అధ్యాపకులు, స్నేహితులు కారణమని, వారికి రుణపడి ఉంటానన్నారు. సినీ హీరోయిన్ ఎస్తేరు మాట్లాడుతూ భీమవరం రావడం ఇదే మొదటిసారని, ఈ ప్రాంత ప్రజల ఆపాయత్యలను ఎన్నటికీ మరిచిపోలేనని చెప్పారు. సినిమా దర్శకుడు ఉదయ్ శంకర్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నిర్మాత మాగంటి బాబు మాట్లాడారు.
పారిశ్రామిక వేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ భీముడిలా ఉండే సునీల్ భీమవరం బుల్లోడుగా మారాడని అన్నారు. ఇంకా మంచి చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు. ముందుగా పలు గ్రూపుల డాన్స్‌లు ఆకట్టుకున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత డి.సురేష్‌బాబు ఆడియో సీడీని విడుదల చేసి మొదటి సీడీని సునీల్‌కి అందజేశారు.
సురేష్ సంస్థ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 50 కిలోల కేక్ కట్ చేశారు. సునీల్, ఎస్తేరు స్టెప్పులేసి అభిమానులను ఉర్రూతలూగించారు. నటులు పృధ్వీరాజ్, జయప్రకాశ్ రెడ్డి, శివపార్వతి, పద్మ, గౌతమ్ రాజు, సినీ పాటల రచయిత చంద్రబోస్, అనంత శ్రీరాం, డాన్స్ మాస్టారు భాను, హరీష్, వితిక, రాజారవీంద్ర, కమెడియన్ రఘు, డీటీఎస్ ఆనంద్, గాయకులు అంజనా సౌమ్య, నిర్మాత అశోక్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. అభిమానులతో డీఎన్నార్ కళాశాల మైదానం కిటకిటలాడింది.